Sakshi News home page

నేటి నుంచి గలగలా గోదారి

Published Sun, Jun 15 2014 1:37 AM

నేటి నుంచి గలగలా గోదారి

తూర్పు, మధ్య డెల్టాలకు నేడు నీటి విడుదల
ధవళేశ్వరం : సుమారు రెండు నెలల అనంతరం గోదారమ్మ పంట కాలువల్లోకి పరుగులు తీయనుంది. తూర్పు,సెంట్రల్ డెల్టాలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. 58 రోజుల విరామం అనంతరం తూర్పు డెల్టాకు, 55 రోజుల విరామం అనంతరం సెంట్రల్ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మధ్య డెల్టాకు, 10.30 గంటలకు తూర్పు డెల్టాకు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ సుగుణాకరరావు లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు తెలిపారు.

వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి. అయితే రబీ పంట ఆలస్యం కావడంతో ఏప్రిల్ 17 వరకు తూర్పు డె ల్టాకు, ఏప్రిల్ 20 వరకు మధ్య డెల్టాకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. దాంతో కాలువలకు షార్ట్ క్లోజర్ పనులను మాత్రమే చేయడానికి వీలైంది. ఆ పనుల కోసమే ఇంతవరకు నీటిని విడుదల చేయలేకపోయారు. తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు రూ. 50 కోట్ల మేరకు పనులను పూర్తి చేసినట్టు ఇరిగేషన్ ఎస్‌ఈ సుగుణాకరరావు శనివారం తెలిపారు.
 
సహజ జలాలే ఆధారం
కాలువలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వర్షాలు  ఇంకా పడకపోవడంతో గోదావరి సహజ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజుకు సుమారు 3,500 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌కు చేరుతుంది. వానలు పడేంతవరకు ఈ నీరే శరణ్యం.
 
ప్రాజెక్టులవారీ క్యాడ్ కమిటీలు వేయాలి
రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి క్యాడ్ కమిటీ ద్వారా ఎటువంటి పనులూ జరగడం లేదని, ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి చిన్న పనికీ రాష్ట్రస్థాయి క్యాడ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. రైతులకు అనువుగా ఉండేలా ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలను వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల రైతుల సమస్యలను సకాలంలో గుర్తించి  వాటి పరిష్కారానికి వెంటనే పనులు చేపట్టడానికి వీలవుతుందన్నారు.
 
నీటితీరువా నిధులు ఇప్పుడా!

నీటితీరువా నిధులు ఇప్పుడు విడుదల చేశారని, కాలువలకు నీళ్లు ఇచ్చే సమయంలో ఈ నిధులు విడుదల చేయడంవల్ల ప్రయోజనమేమిటని త్రినాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది తూర్పు డెల్టాలో ఎ-కేటగిరీ పనులకు రూ.2.85 కోట్లు, బి-కేటగిరీ పనులకు రూ.3.02 కోట్లు నీటి తీరువా నిధులు విడుదలయ్యాయన్నారు. మధ్య డెల్టాలో ఎ-కేటగిరీకి రూ.38 లక్షలు, బి-కేటగిరీకి రూ.3.93 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలువల్లో తూడు తీత పనులు చేపట్టక పోవడంవల్ల వర్షాకాలంలో పంటలు ముంపు బారిన పడే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement