నేడే ఉప ఎన్నిక కౌంటింగ్ | Sakshi
Sakshi News home page

నేడే ఉప ఎన్నిక కౌంటింగ్

Published Mon, Feb 16 2015 3:38 AM

నేడే ఉప ఎన్నిక కౌంటింగ్ - Sakshi

- లక్ష ఓట్లతో గెలుస్తామని టీడీపీ ధీమా
- గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు
- ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్
- 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కింపు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఫలితం సోమవారం తేలనుంది. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు. 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 1,47,153 మంది అంటే 49.92 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషులు 78,238 మంది, మహిళలు 68,915 మంది ఉన్నారు.

ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు.
 
కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు..
కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ వద్ద సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ హర్షదీప్ కాంబ్లే  కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు.

Advertisement
Advertisement