Sakshi News home page

మంత్రుల మధ్య చిచ్చు రేపిన రంజాన్ తోఫా!

Published Thu, Jul 16 2015 3:42 AM

మంత్రుల మధ్య చిచ్చు రేపిన రంజాన్ తోఫా! - Sakshi

సాక్షిప్రతినిధి, అనంతపురం :  రంజాన్‌తోఫా ‘అనంత’ మంత్రుల మధ్య చిచ్చురేపింది. తోఫా పంపిణీ చేసే సంచులపై సీఎం చంద్రబాబుతో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఫోటోను మాత్రమే ముద్రించారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఫోటోను విస్మరించారు. తన ఫోటో లేకుండా సంచులను పంపిణీ చేయడంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పౌరసరాలశాఖ మంత్రిగా సంచిపై సునీత తన ఫోటోను ముద్రించుకోవడం సముచితమే అని, అయితే మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అయిన తన ఫోటోను విస్మరించడం ఎంత వరకు సమంజసమని తోటి మంత్రుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీలో అంతా తన పెత్తనమే ఉందని చాటుకునేందుకే సునీత ఇలా వ్యవహరిస్తున్నారని పల్లె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 కావాలనే మంత్రి పల్లె ఫోటో విస్మరణ:
 ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వాలని నెలకిందటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా 5కిలోల గోధుమపిండి, 2కిలోల చక్కెర, కిలో సేమియా, 100మిల్లీలీటర్ల నెయ్యి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీటన్నిటిని ‘సంక్రాంతి కానుక’ తరహాలో ఒక సంచిలో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి కానుక అనేది ప్రజలందరికీ సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రితో పాటు ఈ శాఖ మంత్రి ఫోటోను సంచులపై ముద్రించారు. వీరితో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు ఫోటోను ముద్రించారు. రంజాన్‌తోఫా అనేది ప్రత్యేకంగా ఓ సామాజికవర్గానికి సంబంధించిన అంశం.

 ఈ క్రమంలో మైనార్టీశాఖ మంత్రి అయిన తన ఫోటోను సంచిపై ముద్రించకపోవడాన్ని పల్లె తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ అంశంలో సునీత వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పల్లె ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చెప్పకుండా కరపత్రాల పంపిణీ చేపట్టాలని సూచించారు.

 దీంతో కేవలం పల్లె రఘునాథరెడ్డిని సంతృప్తి పరచడం కోసం రంజాన్‌తోఫా సంచితో పాటు సీఎం, మంత్రులు పల్లె, సునీత ఉన్న ఫోటోలతో ఉన్న కరపత్రాలను అందించాలని రేషన్‌డీలర్లకు కరపత్రాలు అందించారు. అయితే చాలా చోట్ల కరపత్రాలు రేషన్‌షాపుల్లో పంపిణీ చేయలేదు. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు పల్లె వర్గీయులు కొన్ని రేషన్‌షాపులు తిరిగారు. అయితే చాలాచోట్ల పంపిణీ చేయలేదు. ఎందుకని ఆరా తీస్తే కరపత్రాలు ఇచ్చార ని... సంచుల్లో ఉంచి ముస్లింలకు ఇవ్వాలని తమకు ఎవ్వరూ చెప్పలేదని డీలర్లు చెప్పారు. దీంతో ఇటు అధికారులు, అటు పరిటాల సునీత వ్యవహారాన్ని పల్లె రఘునాథరెడ్డి వర్గీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Advertisement
Advertisement