ఫోర్జరీలతో టోకరా | Sakshi
Sakshi News home page

ఫోర్జరీలతో టోకరా

Published Wed, Feb 24 2016 4:04 AM

ఫోర్జరీలతో టోకరా

దొరవారిసత్రం : నకిలీ పాసుపుస్తకాలతో లక్షల రుణాలు స్వాహా చేసిన ఫోర్జరీ రాయుళ్ల బాగోతమిది. వీఆర్వో నుంచి తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ చివరకు ఆర్డీఓ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి దొంగ పాస్‌పుస్తకాలు సృష్టించారు. దాంతో పాటు బ్యాంకక్‌కు అవసరమైన నోడ్యూస్ సర్టిఫికెట్ కూడా ఫోర్జరీ చేసి లక్ష, రెండు లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్ల పంట రుణాలు స్వాహా చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్‌పుస్తకాలపై రుణం తీసుకున్న వందలమంది దొంగ రైతులు అందరూ దొరవారిసత్రం మండలం తనియాలి రెవెన్యూ గ్రూపు పరిధిలోని కమ్మకండ్రిగ, కొత్తకండ్రిగ, వేటగిరిపాలెం, తనియాలి గ్రామాలకు చెందినవారే కావడం గమనార్హం.

దొంగ పాస్‌పుస్తకాలను సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్, యూనియన్, ఐఓబీ, సిండికేట్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో దొంగ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు పొందారు. ఈతంతు సుమారు ఏడాది నుంచి జరుగుతూనే ఉంది. కొన్ని బ్యాంకుల్లో అయితే రుణాలను రీషెడ్యూల్ కూడా చేసి మళ్లీ పంట రుణాలను అక్రమార్కులు దర్జాగా పొంది ఉన్నారు. తనియాలి రెవెన్యూ పరిధిలో లేని సర్వే నంబర్లను కూడా ఫోర్జరీదారులు సృష్టించారు.

సెంటు భూమి లేనివారిపై కూడా నకిలీ పాస్‌పుస్తకాలు చేసి అక్రమార్కులు (ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు) లక్షలు స్వాహా చేశారు. తనియాలి రెవెన్యూ పరిధిలో సుమారు 700 ఎకరాల పట్టా భూమి ఉండగా, ఫోర్జరీదారులు ఒకరి భూమిని మరో పేరుతో కూడా దొంగ పాస్‌పుస్తకాలు చేయించి రుణాలు పొందారు. ఈ విషయం అసలు పట్టాదారులకు తెలిసి వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చివరికి కాలువ పొరంబోకు భూములు సర్వే నంబర్లు 180,181 కూడా పాస్ పుస్తకాలు చేసి రుణాలు తీసుకున్నారు.
 
బీడీ జయకుమార్ సంతకంతో..
వెలుగులోకి వచ్చిన నకిలీ పాస్‌పుస్తకాలు అన్నీ అప్పట్లో స్థానిక ఎమ్మార్వోగా పనిచేసి పదవీ విరమణ చేసిన బీడీ జయకువ ూర్, మృతిచెందిన వీఏఓ సుందరరామిరెడ్డి పేరుతో బయటపడ్డాయి. ఎలాంటి అనుమానం లేకుండా నకిలీ పాస్‌పుస్తకాలపై యూనిక్ నంబర్లు కూడా వేశారు. 2004, 2006ల్లో పాస్‌పుస్తకాలు పొందినట్లు పక్కగా ప్లాన్ చేసి వివిధ బ్యాంకుల్లో రూ.లక్షల పంట రుణాలను కొల్లగొట్టారు. తనియాలి ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ విషయం కీలపాత్ర పోషిస్తునట్లు తెలుస్తుంది.

భూములు లేనివారిపై దొంగ పాస్‌పుస్తకాలు చేయడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, కొంత నకిలీ రైతులకు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
* కానీ వాస్తవంగా అయితే 2001 డిసెంబర్ 30కి వీఏఓల పాలన రద్దు చేసి 2002 నుంచి 2007 వరకు గ్రామ పంచాయతీ సచివాలయ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈపాస్‌పుస్తకాలన్నీ ఫోర్జరీ అని తేలిపోతుంది.
 
రెవెన్యూ వారి సహకారంతోనే ‘1-బీ’ మార్పు
నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసిన్పటికి 1-బీలో మాత్రం భూమి చెందిన వారి పేరుతో ఉంటుంది. కానీ స్థానికంగా రెవెన్యూ వారి సహకారంతోనే ఏకంగా 1-బీలో పేరును కూడా మార్పు చేసి అక్రమార్కులకు సహకరించినట్లు విశ్వనీయంగా తెలుస్తుంది. ఇప్పటికైన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించందే దొంగ పాస్‌పుస్తకాలుపై చర్యలు తీసుకోందే అసలు అక్రమదారులు బయటపడరు.
 
మాదృష్టికి రాలేదు
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న విషయం మా దృష్టికి రాలేదు. భూమిపై హక్కు ఉన్నవారికి 1-బీ ఇస్తాం. దాన్ని మార్చలేము. అయినా దీనిపై కూడా విచారిస్తాం. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకున్న వారిపై ఇందుకు సాయపడ్డ వారిపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.
 -తహశీల్దార్ శ్రీనివాసులు

Advertisement
Advertisement