తారా తోరణం | Sakshi
Sakshi News home page

తారా తోరణం

Published Mon, Nov 6 2017 8:01 AM

tollywood cricket in ananhapuram - Sakshi

అనంతలో ఆదివారం సినీతారలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో సినీతారల క్రీసెంట్‌ క్రికెట్‌ కప్‌ చైర్మన్‌ షకీల్‌షఫీ ఆధ్వర్యంలో సినీతారల క్రికెట్‌ టోర్నీని ఆదివారం నిర్వహించారు. దీంట్లో ప్రముఖ నటీనటులతో సహా కమెడియన్లు, ఇతర తారాగణం పాల్గొన్నారు. తమ అభిమాన నటీనటులందరినీ ఒకే చోట చూసిన అభిమానులు పులకించిపోయారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అభిమానులకు సినీతారలు అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. ఓ వైపు ఉత్కంఠగా మ్యాచ్‌ జరుగుతూ ఉండగా కమెడియన్లు పంచ్‌డైలాగులతో హాస్యాన్ని పండించారు.

తరుణ్‌ జట్టు విజయం
మొదట బోర్డ్‌ ఆఫ్‌ డిజేబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(బీడీసీఏ) దివ్యాంగుల 5 ఓవర్ల ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. అనంతరం మంత్రి కాలవ శ్రీనివాసులు టాస్‌ ఎగరేశారు. తరుణ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. శ్రీకాంత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. సుధీర్‌ 26 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా, నిఖిల్‌ 14 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 17 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ప్రిన్స్‌ 3 ఫోర్లతో 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. నందకిశోర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో 36 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టి 44 పరుగులు చేసి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. చివరగా ఖయ్యూం 14 బంతుల్లో 12 పరుగులు చేశాడు. తరుణ్‌ జట్టు బౌలర్లలో సామ్రాట్‌ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. ఆదర్శ్‌ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తరుణ్‌ జట్టులో ఓపెనర్లు ఆదర్శ్, విశ్వ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. శ్రీకాంత్‌ జట్టు బౌలర్లు అశ్విన్‌ 3 వికెట్లు తీసి జట్టును విజయం వైపుకు తీసుకెళ్లాడు.

మరో బౌలర్‌ ఖయ్యూం 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రఘు 24 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు జోడించాడు. శేషగిరి 12 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 17 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరిని అశ్విన్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఒకే ఓవర్లో బౌల్డ్‌ చేసి తరుణ్‌ జట్టును ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి కార్తీక్, ప్రభులు బ్యాటింగ్‌ చేసి జట్టుకు విజయాన్నందించారు. దీంతో తరుణ్‌ జట్టు ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే 5 వికెట్లతో విజయాన్ని సాధించింది. బెస్ట్‌ బౌలర్‌గా సామ్రాట్, బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా విశ్వ, బెస్ట్‌ క్యాచర్‌గా భూపాల్, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఆదర్శ్, బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా శివారెడ్డి, బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌(డిజేబుల్డ్‌)గా వసంత్‌కుమార్‌లను ఎంపిక చేశారు.


డ్యాన్సులు.. కేరింతలు

ముందుగా ర్యాప్‌ ర్యాప్‌ షకీల్‌ తన గీతాలతో సందడి చేశారు. అనంత అభిమానులను ప్రణీత పలకరించగా, అర్చన, మధుశాలినీలు తమ మాటలతో అలరించారు. అనంతరం ముమైత్‌ఖాన్‌ తనదైన శైలీలో జోష్‌ నింపారు. మనారా చోప్రా స్టెప్పులతో కుర్రాళ్లను ఉర్రూతలూగించారు. సత్యా మాస్టర్‌ తన స్టెప్పులతో అలరించారు. మొదటి ఇన్నింగ్స్‌ ముగిసిన తరువాత శ్రీకాంత్‌ రా రా.. సినిమా ఆడియోను లాంచ్‌ చేశారు. అనంతరం అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలల సారథ్యంలో తెరకెక్కిన సినిమా ‘టూ ఫ్రెండ్స్, ట్రూ లవ్‌’ ఆడియోను విడుదల చేశారు. మ్యాచ్‌ సాగుతున్నంత సేపూ టిల్లు వేణు, ధన్‌రాజ్, శివారెడ్డిల పంచ్‌లతో హాస్యం పండించారు. చివరిగా శ్రీకాంత్‌ తన కామెంట్రీతో అలరించగా, తనీష్‌ తను శ్రీకాంత్‌కు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా గాయకుడు రేవంత్‌ బాహుబలి చిత్రంలోని మనోహరి పాటతో ఆకర్షించారు. శివారెడ్డి మిమిక్రీతో అలరించారు. సంపూర్ణేష్‌బాబు, గీతాసింగ్, అల్లరి నరేష్, మాధవిలత, సుధీర్‌బాబు, తారక్, అయ్యప్ప, రాజీవ్, అజయ్, ఇతర సినీ తారలు తమ అనుభూతులను పంచుకున్నారు. చివరిగా సత్యా మాస్టర్, ఇతర డ్యాన్సర్లు సందడి చేశారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, జడ్పీ చైర్మెన్‌ పూల నాగరాజు, మాజీ జడ్పీ చైర్మన్‌ చమన్‌సాబ్, నగర మేయర్‌ స్వరూప, కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement