యువత భవిత కోసమే దీక్ష: నటుడు శివాజీ | Sakshi
Sakshi News home page

యువత భవిత కోసమే దీక్ష: నటుడు శివాజీ

Published Sun, May 3 2015 7:54 PM

యువత భవిత కోసమే దీక్ష: నటుడు శివాజీ - Sakshi

గుంటూరు: రాష్ట్ర యువత భవితే లక్ష్యంగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడుతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ 48 గంటల దీక్షను ఆయన గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆదివారం ప్రారంభించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ శివాజీ మెడలో పూల మాలవేసి దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలో కలసి రావాలని కోరారు. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఆంధ్ర ప్రేక్షకుల అభిమానంతోనే ఇంతటి వాడినయ్యానని ఆ రుణం తీర్చుకోవటానికే ఈ ఉద్యమం చేపట్టానని చెప్పారు. ఎన్నికల సమయంలో పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకులు నేడు లేనిపోని సాకులు చూపించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం దీనిపై నోరుమెదపకపోవడం దారుణమని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న టీడీపీ నాయకులు నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు విదేశాలు తిరుగుతున్నారని... అక్కడి వారు రాయితీలు కోరుతున్నారనీ, ప్రత్యేక హోదా లేకుండా రాయితీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను ఈ ఉద్యమం చేస్తున్నందుకు బీజేపీ తనను బహిష్కరించినా సంతోషమేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ మిజోరాం, అసోం, జార్ఖండ్ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ప్రత్యేక హోదా కల్పించారో ఆ అర్హతలన్నీ మన రాష్ట్రానికి ఉన్నాయన్నారు. శివాజీ ప్రాణాలు పోకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. దీక్షకు మాలమహానాడు, అమ్‌ఆద్మీ పార్టీ, యువజన కాంగ్రెస్, నవతరం పార్టీ నాయకులు, పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు.
 

Advertisement
Advertisement