నిలదీద్దాం రండి | Sakshi
Sakshi News home page

నిలదీద్దాం రండి

Published Thu, Dec 4 2014 2:55 AM

నిలదీద్దాం రండి - Sakshi

సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘నోరు ఒకటి చెబుతుంది.. చెయ్యి మరొకటి చేస్తుంది. దేనిదోవ దానితే ’అనే రీతిలో వ్యవహరించి, రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కారుపై ప్రత్యక్ష ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. వ్యవసాయ, డ్వాక్రా, బంగారు రుణాలు పూర్తిగా మాఫీ చేసి రైతులు,  మహిళలను ఆదుకుంటామని గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఈ హామీపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలో హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై గత నెల 5న అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట రేపు మహా ధర్నాకు సన్నద్ధమైంది.    
 
 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాలను, బంగారు తాకట్టుపెట్టి తెచ్చుకున్న అప్పులను తాను పూర్తిగా మాఫీ చేస్తానని ఏ ఒక్కరూ రుణాలు చెల్లించొద్దని పాదయాత్ర సందర్భంగా గుంతకల్లు సభలో చంద్రబాబు వాగ్దానం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ సభలోనూ పదేపదే ఇదే మాటను వల్లె వేశారు. తమకున్న లక్షల రూపాయల బాకీ మాఫీ అవుతే కష్టాల నుంచి గట్టెక్కొచ్చని రైతులు, మహిళలు భావించారు. టీడీపీకి ఓట్లేసి బాబును సీఎం పీఠమెక్కించారు. అయితే ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా గద్దెనెక్కాక చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. బకాయిలను పూర్తిగా చెల్లించకుండా షరతులు విధించారు.
 
  రుణమేదైనా కుటుంబంలో ఒక్కటి మాత్రమే మాఫీ చేస్తానని బాంబు పేల్చారు. అంతటితో ఆగక పంటరుణాలైతే 1.50 లక్షల వరకు, బంగారు రుణాలైతే 50 వేల వరకు, డ్వాక్రా రుణాలైతే ఒక్కో సంఘానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని తేల్చిచెప్పాడు. ఈ మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు ఖంగుతిన్నారు. తాను మారిపోయానని.. ఒక్క అవకాశం ఇవ్వండని చంద్రబాబు చెప్పిన మాటను నమ్మి ఓటేస్తే... ఇలా నమ్మించి గొంతుకోస్తాడని ఊహించలేదని రైతులు, మహిళలు మండిపడుతున్నారు.
 
 ‘అనంత’ రుణ భారం ఇది:    
 జిల్లాలోని రైతాంగానికి రూ.4,944 కోట్ల బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసి ఉంటే 6.08 లక్షల రైతులకు సంబంధించి రూ.3,093 కోట్ల పంట రుణాలతో పాటు బంగారు తాకట్టుతో తీసుకున్న 2.12 లక్షల మంది రైతుల 1,851 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యేవి. అయితే ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. కనీసం రీషెడ్యూలు చేసి రైతులకు కొత్త రుణాలు కూడా ఇప్పించలేకపోయింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3,350 కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
 
  రైతులు బకాయిలు చెల్లించకపోవడంతో ఖరీఫ్‌లో కేవలం రూ.350 కోట్ల పంట రుణాలు, 400 కోట్ల రూపాయల గోల్డ్‌లోన్లు మాత్రమే ఇచ్చారు. రైతులు రుణాలు తీసుకోకపోవడంతో అనివార్యంగా వాతావరణ బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో ఈ ఏడాది 17 శాతం మంది రైతులు మాత్రమే వాతావరణ బీమా ప్రీమియాన్ని చెల్లించారు. త క్కిన 83 శాతం మంది బీమాకు దూరమయ్యారు. ఈ ఏడాది వర్షాభావంతో జిల్లాలో సాగు చేసిన 5.06 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రైతులు బీమా చెల్లించక పోవడంతో జిల్లా రైతులకు వాటిల్లిన రూ. 1600 కోట్ల రూపాయల పంట నష్టంలో చిల్లిగవ్వ కూడా రాని పరిస్థితి నెలకొంది.
 
 గతేడాది బీమా సొమ్ము బకాయిల కింద జమ2013-14కు సంబంధించి 220 కోట్ల రూపాయల వాతావరణ బీమా మంజూరైంది. ఈ డబ్బులు విడుదలై రెన్నెళ్లు కావస్తోంది. బీమా సొమ్మును బ్యాంకర్లు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. రైతుల పాతబకాయిల కింద జమ చేసుకుంటున్నారు. ఈక్రమంలో గతేడాది పంట నష్టం.. పంట సాగుకు చేసిన అప్పులు, ఈ ఏడాది సాగుకు చేసిన అప్పు..పంట పూర్తిగా నష్టపోయిన వైనం.. వెరసి ఆర్థికంగా రైతు కుటుంబాలు చితికిపోయాయి. రుణమాఫీపై చంద్రబాబు చేసిన వాగ్దానాలు నీటి బుడగలని తేలిపోయాయి. దీంతో మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో ఒక్క ‘అనంత’లో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే రైతుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఇట్టే తెలుస్తోంది.  
 
 కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి హాజరు
 ‘అనంత’ మహాధర్నా కోఆర్డినేటర్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. రేపు మహాధర్నాకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు.   
 
 ధర్నాకు తరలిరండి
 రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మాట తప్పడంతోనే రైతుల అప్పులు తలకు మించిన భారంగా మారాయి. తద్వారా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటికి పూర్తిగా చంద్రబాబే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట తప్పిన ప్రభుత్వంపై రేపు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతున్నాం. ఈ ధర్నాకు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలి.
 - శంకర్‌నారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 రైతులంతా సంఘటితంగా పోరాడాలి
 గత నెలలోధర్నా చేస్తామంటే రైతుల జాబితా ప్రకటించారు. ఇప్పుడు మహాధర్నా చేస్తామంటే కొంత డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. ప్రతిపక్షానికి జంకి మాటలతో పబ్బం గడపడం మినహా రైతుల శ్రేయస్సుపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతోనే రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కేవలం ప్రభుత్వ తీరుతోనే రైతులు పంట బీమాను కోల్పోతున్నారు. నిబంధనల మేరకు బీమా సొమ్మును పాత బకాయిల కింద బ్యాంకర్లు జమ చేసుకోకూడదు. అయినా జమ చేసుకుంటున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు బ్యాంకర్లను నిలువరించలేకపోతున్నారు. పైగా 14 శాతం వడ్డీని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. రైతులంతా ప్రభుత్వంపై సంఘటితంగా పోరాడాలి. రేపటి మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలి.   
 - అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement