రేపట్నుంచి జన్మభూమి | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి జన్మభూమి

Published Wed, Oct 1 2014 2:28 AM

రేపట్నుంచి జన్మభూమి - Sakshi

పదమూడు రోజులపాటు కార్యక్రమాలు
రోజుకో జిల్లాలో జన్మభూమిలో పాల్గొంటా
ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు, పారిశుధ్యంపై ప్రధాన దృష్టి
పెన్షన్ పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’గా పేరు
జన్మభూమి ముగిసేదాకా బదిలీలపై నిషేధం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో  ముఖ్యమంత్రి చంద్రబాబు

 
హైదరాబాద్: అక్టోబర్ 2వ తేదీ నుంచి తొలి విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో పాటు అధికారులందరికీ ఆయన జన్మభూమి కార్యక్రమం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు, పారిశుధ్యం అమలుపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో విడివిడిగా ప్రణాళికలు రూపొందించుకుని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. 13 రోజుల పాటు అంటే అక్టోబర్ 20 వరకూ జన్మభూమి కార్యక్రమాలు ఉంటాయని, తాను కూడా రోజుకో జిల్లా చొప్పున 13 రోజుల పాటు ఆయా జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి వసతి కల్పించాలని, అలాగే కమ్యూనిటీ లెట్రిన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా నగరాల్లో చెత్త సేకరణ, దాని తరలింపు ఎవరికీ ఇబ్బందీ కలగని రీతిలో చేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడటం, రోడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంవంటి బాధ్యతలను ఈ కార్పొరేషన్ చేపడుతుందన్నారు. అక్టోబర్ 2వ తేదీనే రెండ్రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని ఎన్టీఆర్ సుజల పేరుతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ర్టస్థాయిలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు పూర్తిస్థాయి సమాచారంతో జిల్లాలకు వెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకుని, ఆ వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు. వీటి ఆధారంగానే పథకాల రూపకల్పన జరుగుతుందని, బడ్జెట్ కేటాయింపులకూ ఇదే ఆధారమని ఆయన తెలిపారు.
 
పెన్షన్ పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’


వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ల పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’గా నామకరణం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. ఆదిమ జాతి గిరిజనులకు జీవితకాలం తక్కువ కాబట్టి వారికి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా గర్భిణులు, శిశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, నేత్రవైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గర్భిణులకు సుఖ ప్రసవం జరిగేవిధంగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో గర్భిణుల సంఖ్య, ప్రసవ తేదీలు విధిగా నమోదు చేసే బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పజెప్పాలన్నారు. స్కూళ్లలో డ్రాపౌట్స్ తగ్గించాలని చెప్పారు. మీరు-చెట్టు, బడిపిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, స్వచ్ఛాంధ్ర అనే ఐదు ప్రధాన  అంశాలపై దృష్టి సారించి ముందుకెళ్లాలన్నారు. జన్మభూమి తొలిరోజున ప్రజలను ఉత్తేజపరిచే, అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జన్మభూమి కార్యక్రమ నిర్వహణపై ఇప్పటికే ఆయా జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు సీఎం చెప్పారు.
 
మూడేళ్లలో అన్నీ ఆన్‌లైన్‌లోనే

రానున్న మూడేళ్లలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలూ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని చంద్రబాబు కలెక్టర్లకు ఆదేశించారు. ఇకపై అన్ని సంక్షేమశాఖల కార్యక్రమాలు ఆన్‌లైన్ చెయ్యాలని, మూడేళ్లలో అన్నీ ఆన్‌లైన్‌పరిధిలోకి రావాలని సూచించారు. భవిష్యత్‌లో ఎంపీడీవోలు, మండలస్థాయి ఇంజనీరింగ్ అధికారులందరికీ ఐపాడ్‌లు ఇవ్వనున్నట్టు చెప్పారు. పింఛన్ల పంపిణీకి కూడా ఈ-పాస్ విధానం అమలు చేయడంవల్ల పింఛనుదారులకు ఎక్కడనుంచైనా పింఛన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. జన్మభూమి కార్యక్రమం 13 రోజుల పాటు జరుగుతున్న కారణంగా వచ్చే నెల 21 వరకూ బదిలీలపై నిషేధం ఉంటుందని, ఆ తర్వాతే బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు.
 
సీఎస్, డీజీపీలూ పాల్గొంటారు

జన్మభూమి కార్యక్రమంలో అక్టోబర్ 2న విజయవాడలో తాను పాల్గొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కింది స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ల వరకూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారి (డీజీపీ)లు కూడా జన్మభూమిలో పాల్గొంటారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు మున్సిపాలిటీ, పంచాయితీల స్థాయిలో ప్రజాప్రతినిధులందరూ కార్యక్రమానికి రావాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సుమారు గంటన్నరసేపు సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబు, కొల్లు రవీంద్ర, కిమిడి మృణాళిని, పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement