ఊరంతా షాక్ | Sakshi
Sakshi News home page

ఊరంతా షాక్

Published Mon, Feb 24 2014 4:05 AM

ఊరంతా షాక్

ఊరంతా షాక్
 
 వేలేరుపాడు,
 మండలంలోని బోళ్లపల్లి గ్రామంలో విద్యుత్ పరికరాలు ఏవి పట్టుకున్నా షాక్ కొడుతుండడంతో జనం భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయి.

 

వేలేరుపాడు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఊరికి దగ్గర్లోని 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే గత మూడేళ్లుగా తరచూ లోఓల్టేజీ సరఫరా కొనసాగుతున్నా విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. లోఓల్టేజీ ఉన్న సమయంలో అంతా ఫేస్ సరఫరా అవుతోంది. దీంతో టీవీలు, సెల్‌ఫోన్ చార్జర్‌లు, స్విచ్‌బోర్డులు, కరెంట్ ద్వారా పనిచేసే ఏ వస్తువును ముట్టుకున్నా....షాక్ కొడుతోందని స్థానికులు అంటున్నారు. అయితే లోఓల్టేజీ వల్ల కరెంట్ షాక్ రాదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. కరెంట్ వస్తువులు ఏది ముట్టుకున్నా....షాక్ కొడుతోందని విద్యుత్ సిబ్బంది తమ గోడును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

లోఓల్టేజీ రావడానికి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద  ఉన్న  న్యూట్రల్  వైరే కారణమని గామస్తులు  ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ద్వారా  తెలుసుకున్నారు. ఈ విషయమై అనేక సార్లు విద్యుత్ శాఖ వారికి  మొరపెట్టుకున్నా..వారు స్పందించలేదని చెబుతున్నారు. చివరకు  ఎలక్ట్రిషన్ సలహా మేరకు  న్యూట్రల్  వైర్ ఉన్న ప్రదేశంలో గ్రామస్తులే గొయ్యి తవ్వి అందులో నీళ్లు, బొగ్గులు, ఉప్పు వేస్తున్నారు. వేసిన కొద్దిరోజులు లోఓల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తర్వాత పాతసమస్యే పునరావృతం అవుతోంది. ఇకనైనా  సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు

Advertisement
Advertisement