ఉల్లంఘనులు | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులు

Published Fri, Apr 10 2015 4:26 AM

Traffic police turned into photographers

ఫొటోగ్రాఫర్లుగా మారిన ట్రాఫిక్ పోలీసులు
వీడియోలు, ఫొటోలతో నగరంలో హల్‌చల్
అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్
బందరురోడ్డులో అర్థంలేని నిబంధనలతో వాహనదారుల అవస్థలు

 
నగరంలో తాజా ట్రాఫిక్ నింబధనలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల చేతిలో కెమెరాలు పెట్టి ఇష్టానుసారంగా ఫొటోలు తీయించి జరిమానాలు విధించడం, బందరురోడ్డులో అర్థంలేని ట్రాఫిక్ నిబంధనలు విమర్శలకు తావిస్తున్నాయి. స్వామిభక్తి ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చేందుకు పోలీసులు కావాలనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు.
 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ట్రాఫిక్ పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించేవారు.. ప్రమాదాలు జరగకుండా, ప్రయాణాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకునే రక్షకభటులు. కానీ, నగరంలో పరిస్థితి చూస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులంటే ఫొటో, వీడియోగ్రాఫర్లే గుర్తొస్తారు. చోద్యంగా ఉన్నా ఇది నిజమే. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు, నిబంధనలను తప్పనిసరిగా పాటించేందుకు నగర పోలీస్ కమిషనర్ వీరి చేతిలో కెమెరాలు పెట్టారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఫొటో తీసి వారి వాహనం నంబరు ఆధారంగా ఇంటికే జరిమానా చలానాలు పంపించే ఈ విధానాన్ని గత నెలలో ప్రారంభించారు. అయితే, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తీస్తున్న ఫొటోలకు చిక్కకుండా తప్పించుకునే పనిలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

రెడ్‌‘సిగ్నల్’ వ్యవస్థ

నగరంలోని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయట్లేదు. కొన్నిచోట్ల సిగ్నల్ సెంటర్లలో ఎల్లో లైట్లు లేవు. నేరుగా రెడ్‌లైట్ పడిపోతోంది. మరికొన్ని చోట్ల వాహనాలు రోడ్డు మధ్యలో ఉండగానే రెడ్‌సిగ్నల్ పడిపోతోంది. అదే సమయంలో వేరే వైపు నుంచి వచ్చే వాహనాలు బయల్దేరడం, ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది.

అర్థంలేని నిర్ణయాలతో హడావుడా..!

బందరురోడ్డులోని డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు వెళ్లే వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. గతంలో ఇక్కడ బందర్‌రోడ్డు క్రాస్ చేసేందుకు 15 సెకన్ల సిగ్నల్ సమయాన్ని మాత్రమే ఇచ్చేవారు. దీనిని కనీసం 30 సెకన్లకు పెంచితే ట్రాఫిక్ తగ్గేది. ఇదంతా ఎందుకనుకున్న ట్రాఫిక్ పోలీసులు ఏకంగా డీవీ మనార్, పీవీపీ వద్ద రోడ్డు క్రాసింగ్ రద్దుచేశారు. తాజా నిర్ణయంతో డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు రావాలంటే బెంజిసర్కిల్ వరకు వెళ్లి తిరిగి రావాలి. స్వీట్ మ్యాజిక్ నుంచి డీవీ మానర్‌కు వెళ్లాలంటే పీవీపీ వద్దకు వెళ్లి రోడ్డు క్రాస్ చేసి రావాలి. 20 సెకన్లలో రోడ్డు దాటే పద్ధతికి స్వస్తిచెప్పి ఏకంగా ఐదు నిమిషాల పాటు కిలోమీటరున్నర తిరిగొచ్చేలా అధికారులు నిర్ణయించారు. దీంతో బిజీ సమయంలో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.

వన్‌వేలు, నో పార్కింగ్‌లు ఎక్కడ సార్?

♦ నగరంలో వన్‌వేలు, నో పార్కింగ్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. మచ్చుకైన హెచ్చరిక బోర్డులు కనిపించవు. నగరానికి కొత్తగా వచ్చిన వారైతే ఎటు వెళ్లాలో కూడా సమాచారం ఉండదు.
♦ ఇంతా జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం కెమెరాలు పట్టుకుని ఫొటోలు తీసేస్తూ తమ పని తాము చేసుకుంటున్నారు. హెచ్చరికల బోర్డులు లేనపుడు ఫొటోలు తీసి జరిమానాలు ఎలా విధిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

తప్పొకరిది.. జరిమానా వేరొకరికా..?

వాహనదారుడి స్నేహితుడు కావచ్చు.. బంధువు కావచ్చు.. తెలిసిన మరెవరైనా కావచ్చు. ఏదైనా పనిమీద అర్జెంటుగా వెళ్లాల్సి రావచ్చు. అటువంటి సమయాల్లో పక్కవారి వాహనాలు వాడుకోవడం కొత్తేమీ కాదు. నగర పోలీసుల కొత్త చట్టం ప్రకారం వాహనం ఎవరు నడిపినా శిక్ష మాత్రం వాహన యజమానికే చలానా రూపంలో వెళ్లిపోతోంది. ఇది ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.

150 కెమెరాలు, 26 వీడియో కెమెరాలు

నగరంలో ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయివారు ఫొటోలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐ స్థాయి నుంచి పైఅధికారులతో పోలీస్ కమిషనర్ వీడియో కెమెరాల బృందాలను ఏర్పాటుచేశారు. వీరంతా నగరంలోని 26 ప్రాంతాల్లో వీడియోలు తీయడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిన అధికారులు ఇలా తిరుగుతుండటంతో జనం నవ్వుకుంటున్నారు.

బందరురోడ్డుపై ఆంక్షలు ఎవరి కోసం..?

బందరురోడ్డులో ఇటీవల అమలుచేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు స్వామిభక్తి కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డును నేరుగా దాటే కార్యక్రమానికి స్వస్తిచెప్పి ఊరంతా తిరిగొచ్చేలా పోలీసులు ప్లాన్ వేసి అమలుచేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు పోరంకిలో నివాస గృహం నిర్మితం కానుంది. ముందు నుంచే జనానికి ట్రాఫిక్ ఆంక్షలు అలవాటు చేసేందుకు పోలీసులు తీసుకున్న నిర్ణయాల్లో భాగమే ఇదని వాహనదారులు పేర్కొంటున్నారు.

ఖజానా నింపుకొనేందుకేనా?

పోలీసులు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే పనుల్లో భాగమే ఈ ట్రాఫిక్ చర్యలని  సమాచారం. నెలకు కోటి రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఫొటోలు, వీడియోల ద్వారా రోజుకు కనీసంగా 500 మంది నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు.

Advertisement
Advertisement