పండగ పూట విషాదం | Sakshi
Sakshi News home page

పండగ పూట విషాదం

Published Sat, Aug 17 2013 12:11 AM

tragedy on festival day

 ధవళేశ్వరం, న్యూస్‌లైన్ :పండగ పూట దైవ దర్శనానికి వెళ్లడానికి పుణ్య స్నానాలు చేసేందుకు గోదావరిలో దిగిన దంపతులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. వేమగిరికి చెందిన గంజి మురళీకృష్ణ(30), కనకదుర్గాభవాని(దేవి)(27) శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయానికి వెళ్లేందుకు ఉదయం ధవళేశ్వరం వచ్చారు. స్థానిక రామపాదాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరిలోకి దిగారు. ఇటీవల వరదలతో రేవులో ఇసుక కొట్టుకుపోయి లోతు బాగా పెరిగింది. దీనిని గుర్తించని కనకదుర్గాభవాని లోనికి దిగడంతో నీటిలో గల్లంతైంది. ఆమెను గమనించిన మురళీకృష్ణ గోదావరిలోకి దిగాడు.
 
 ఆమెను రక్షించే క్రమంలో అతడూ గల్లంతయ్యాడు. స్థానికులు కర్ర, తాడును మురళీకృష్ణకు అందించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. స్నానానికి వచ్చిన అక్క, బావ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కనకదుర్గాభవాని తమ్ముడు రామపాదాల రేవుకు వచ్చాడు. ప్రమాద విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నాడు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు, మత్య్సకారులు గాలించగా.. మురళీకృష్ణ మృతదేహం లభించింది. కనకదుర్గాభవాని కోసం గాలింపు కొనసాగుతోంది. మురళీకృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామపాదాల రేవు ఒడ్డున మురళీకృష్ణ, కనకదుర్గాభవానిల చెప్పులు, రెండు కొబ్బరి కాయలు, వాటర్ బాటిల్ ఉన్నాయి. సంఘటన స్థలాన్ని సీఐ అరిగెల ప్రసాద్‌కుమార్ పరిశీలించారు. ధవళేశ్వరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 పాపం చిన్నారులు
 మురళీకృష్ణ, కనకదుర్గాభవానిలకు పెద్ద కుమారుడు ఐదేళ్ల శతకిరణ్, చిన్న కుమారుడు నాలుగేళ్ల శశిశేఖర్ ఉన్నారు. వీరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకునేవారని బంధువులు సంఘటన స్థలంలో కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మనాన్నలు ఎక్కడ ఉన్నారంటే వారికి ఏం చెప్పాలంటూ రోదించడం అక్కడి వారిని కలచివేసింది. వైఎస్సార్ సీపీ నాయకుడు రావిపాటి రామచంద్రరావు మృతుల బంధువులను పరామర్శించారు.  సర్పంచ్ గుత్తుల హరిప్రసాద్, ఉప సర్పంచ్ సూరపురెడ్డి జానకిరామయ్య గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

Advertisement
Advertisement