బదిలీల జాతర | Sakshi
Sakshi News home page

బదిలీల జాతర

Published Thu, Aug 21 2014 12:33 AM

Transfer fair

  •     కోరుకున్న స్థానానికి ఉద్యోగుల ప్రయత్నాలు
  •      అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు
  • విశాఖ రూరల్ : ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో బదిలీల జాతర మొదలైంది. ఆశించిన స్థానాన్ని దక్కించుకోడానికి ఉద్యోగులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీస్సుల కోసం తపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో నెంబర్ 175ను జారీ చేసింది. దీంతో జిల్లా, జోనల్ స్థాయితో పాటు రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు కూడా స్థానచలనాలు కలగనున్నాయి.

    గతంలో మాదిరిగా ఒక సీటులో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికే బదిలీ చేయాలన్న నిబంధన ఉండగా ఈసారి మాత్రం ప్రతీ ఒక్కరినీ బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒక్క మినిస్టీరియల్ సిబ్బంది విషయంలో మాత్రం 3 ఏళ్లు నిబంధన పెట్టింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టుల విషయంలో మాత్రం మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బదిలీ జరగనుంది.

    ఇటీవల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 80 శాతం మంది అధికారులు, ఉద్యోగులకు బదిలీలయ్యాయి. ఎన్నికల అనంతరం వారి యథాస్థానాల్లో చేరారు. కేవలం 2 నెలలు మాత్రమే ఆయా సీట్లలో ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం ప్రతి ఒక్కరి బదిలీకి అవకాశం కల్పించింది. అలాగే 20 శాతానికి మించకుండా బదిలీలు చేయకూడదన్న నిబంధనను కూడా సడలించింది.  
     
    సిఫార్సులకే పెద్దపీట!
     
    జిల్లాలో బదిలీల ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ సిఫార్సుల లేఖలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించారని అనుమానం ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికార పార్టీ నేతలు గట్టి నిర్ణయంతో ఉన్నారు. అలాగే వారిని ప్రసన్నం చేసుకున్న వారికి మంచి పోస్టింగ్‌లు కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఉన్నతాధికారులకు తమ వారి జాబితాను పంపిస్తామంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.

    జిల్లా పరిషత్‌లో దాదాపుగా 200 మందికి స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఎంపీడీవో నుంచి టైపిస్టు వరకు ఇలా అన్ని స్థాయిల్లోనూ ఎవరికి వారు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ  బదిలీలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చేస్తారు. దీంతో ఆమె ఆశీస్సుల కోసం అధికారులు కిందామీదా పడుతున్నారు. అలాగే రెవెన్యూలో కూడా భారీగా స్థానచలనాలు కలగనున్నాయి. తహశీల్దార్ స్థానాల కోసం ఇద్దరు మంత్రుల చుట్టూ కొందరు అప్పుడే తిరుగుతున్నారు. ప్రధానంగా విశాఖరూరల్, పెందుర్తి, గాజువాక, భీమిలి, ఆనందపురం తహశీల్దార్ స్థానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది.

    ఈ సీటు కోసం కొంత మంది రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైద్య,ఆరోగ్య, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, సిబ్బంది బదిలీలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. మిగిలిన శాఖల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఇంకొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
     

Advertisement
Advertisement