Sakshi News home page

ఇంటి దొంగలు

Published Sat, Jan 25 2014 6:12 AM

transformers Copper Wire selling

నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్‌వైర్‌ను అమ్ముకోగా వచ్చిన డబ్బులను, కాంట్రాక్టులు అధికారులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యూనియన్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అవీనీతిపై ట్రాన్స్‌కో సీఎండీ కార్తికేయమిశ్రా సీరియస్‌గా తీసుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఏడీ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ విషయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కావాలని ట్రాన్‌కో ఎస్‌ఈ నగేశ్‌కుమార్‌కు ఆదేశించారు.
 
 ఏం జరిగిందంటే
 కొద్ది నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కోసం జిల్లా స్టోర్ నుంచి రూ. 20 లక్షల విలువ చే సే కాపర్ వైరును విడుదల చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే రూ. 20 లక్షల విలువ చేసే మెటీరియల్ ఇచ్చిన సదరు అధికారులు.. దానిని కాంట్రాక్టరే కొనుగోలు చేశారని రికార్డుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ. 20 లక్షల బిల్లును కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే రూ. 20 లక్షల వైరుతోపాటు, 20 లక్షల రూపాయలనూ కాంట్రాక్టర్‌కు దోచిపెట్టారన్నమాట. అధికారులు ఇలా ‘అదనపు సంపాదన’ కోసమే చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు.
 
 ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు అనంతరం కాలిపోయిన కాపర్‌వైరును స్టోర్‌లో జమచేయా ల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాతదాని బదులు కొత్త వైరు ఇస్తారు. స్టాక్ లేకపోతే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఏడాదిగా పాత వైరును స్టోర్‌లో జమ చేయడం లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 20 లక్షల విలువ చేసే పాత వైరుకు లెక్కలు చూపలేదని సమాచారం. కాపర్ వైరుకు డిమాండ్ ఉండడంతో మరమ్మతు కేంద్రాల్లోని అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాత వైరును అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
 
 రికార్డులు మాయం
 అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు రికార్డులను సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరైతే రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఏడీ నాగరాజు.. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుకు సంబంధించిన రికార్డులను ఏడాది కాలంగా నిర్వహించడం లేదు. తన సెక్షన్‌కు సంబంధించి స్టాక్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశామన్న వివరాలను ఆయన రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొన్న సదరు ఏడీ.. కాంట్రాక్టర్లతో దోస్తీ కట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఏడీ కార్యాలయానికి వచ్చిన డీఈ.. ట్రాన్స్‌ఫార్మర్ల సంబంధించిన రికార్డ్స్ చూపించాలని అడగ్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్లను అమ్ముకున్నారని, అందుకే రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఉన్న రిజిస్టర్లను సైతం మాయం చేశారని తెలుస్తోంది.
 
 నాలుగు రోజుల్లో విచారణ పూర్తి
 -నగేశ్, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో, నిజామాబాద్
 ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులను విచారణ అధికారులుగా నియమించాం. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి, సీఎండీకి నివేదిక పంపిస్తాం. ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది విచారణ నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement