ఇక ఈ-పంచాయతీ | Sakshi
Sakshi News home page

ఇక ఈ-పంచాయతీ

Published Sat, May 10 2014 4:11 AM

Transparency public services in panchayat

పంచాయతీల్లో పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. గ్రామ సచివాలయాలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. ప్రపంచంలోని ఏ మూలనుంచైనా జిల్లాలోని గ్రామాల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అతిత్వరలో రానుంది. పది రోజుల్లో జిల్లాలో మొదటి విడత కింద ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది.  

 ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ :  జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇక పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. ఈ-పంచాయతీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1028 పంచాయతీలు ఉన్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అలా మొత్తం పంచాయతీలను 568 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. వీటిలో బిల్లింగ్, విద్యుత్ సౌకర్యం ఉన్న పంచాయతీలను గుర్తించారు. మొదటి విడతగా 279 క్లస్టర్లలో ఈ-పంచాయతీ వ్యవస్థ అమలు చేసేందుకు కార్వే డేటా మేనేజ్‌మెంట్ అనే కంపెనీ అన్ని సిద్ధం చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక కంప్యూటర్ మంజూరు చేశారు. రెండు క్లస్టర్లకు కలిపి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. ప్రతి మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు.

 జిల్లాలోని మూడు డివిజన్లకు మూడు కంప్యూటర్లను డీఎల్‌పీఓల పరిధిలో ఏర్పాటయ్యాయి. జిల్లా పరిషత్తు సీఈఓ పరిధిలో మరో రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారికి రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. 143 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ-పంచాయతీపై ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో ఒంగోలు సమీపంలోని ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చినట్లు కార్వే డేటా కంపెనీ జిల్లా కో-ఆర్డినేటర్ పి.బ్రహ్మంరాజు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ ఒక క్లస్టర్ పరిధిలో మూడు రోజులు, ఇంకొక క్లస్టర్ పరిధిలో మరో మూడు రోజులు పనిచేస్తారని వివరించారు. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్లకు ఆన్‌లైన్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా టి.జ్యోతి, ఏడీపీఎంగా ఎస్‌కే ఫరూక్‌ను కార్వే కంపెనీ నియమించింది.

 ఈ-పంచాయతీ ద్వారా ఏమి చేస్తారంటే..
 ఈ-పంచాయతీ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అన్ని సేవలు అందనున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. గ్రామ జనాభా వివరాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీలు ఎంతమందో వివరంగా పొందుపరుస్తారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
 
 గ్రామ సభల వివరాలు, పన్నుల వివరాలు అన్ని పొందుపరుస్తారు. గ్రామానికి సంబంధించిన వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతాయి. ఎక్కడినుంచైనా ఆన్‌లైన్ ద్వారా ఆయా పంచాయతీల సమాచారం తెలుసుకోవచ్చు. మొదటి విడత అనంతరం రెండో విడత ప్రక్రియను అమలు చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని కార్వే కంపెనీ చూస్తోందని పేర్కొన్నారు. ఈ-పంచాయతీ ఏర్పాటు పూర్తయిన తరువాత వీటిపై మా పర్యవేక్షణ ఉంటుందని ఆమె వివరించారు. పదిరోజుల్లో పూర్తి స్థాయిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement