రవాణా ‘రియల్' ఎత్తు | Sakshi
Sakshi News home page

రవాణా ‘రియల్' ఎత్తు

Published Mon, Nov 3 2014 12:14 AM

రవాణా ‘రియల్' ఎత్తు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/దర్గామిట్ట: ఇప్పటిదాకా డబ్బులు సంపాదించేందుకు కొందరు వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. వారిని రియల్టర్లుగా పిలుస్తున్నాం. తాజాగా వ్యాపారుల స్థానంలో అధికారులే రియల్టర్ల అవతారం ఎత్తుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన కొందరు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసుకుని.. అందులో ప్లాట్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. అందులో రవాణాశాఖ అధికారులు కూడా ఉన్నారు.

పనిలో పనిగా తమ శాఖ కార్యాలయాన్ని కూడా ఆ ప్లాట్ల వద్దకే మార్చుకుని వాటి విక్రయానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే గూడూరు శివారు ప్రాంతంలో ఆదివారం ప్రారంభం కానున్న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే గూడూరు సమీపంలోని పురిటిపాళేనికి వెళ్లాల్సిందే.

గూడూరు పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నుంచి పోటుపాళెం పంచాయతీ పరిధిలోని పురిటిపాళెం వెళ్లే మార్గంలో కొందరు రవాణాశాఖ అధికారులు కలిసి ‘అప్ టౌన్ వింటేజ్’ వెంచర్ ఏర్పాటు చేశారు. 2011 నవంబర్‌లో కొండయ్య బాలసుబ్రమణ్యం, గోగినేని సురేష్‌బాబు, అన్నవరపు కాశీవిశ్వనాథం, సిల్వర్ సౌండ్స్ షెల్టర్ ప్రైవేట్ లిమెటెడ్ పేరుతో సర్వే నంబర్ 1052 నుంచి 1066 వరకు ఉన్న 28.5 ఎకరాల వ్యవసాయ భూమిని  కొనుగోలు చేసి వెంచర్ల కోసం కన్వర్షన్ చేశారు. అందులో ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు.

అయితే ఆ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  అనంతరం ఈ భూమిని  వ్యవసాయ భూమి కింద వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వర్షన్‌గా మార్చిన భూమిని వ్యవసాయ భూమిగా మార్చేందుకు వీల్లేదు. అయితే అధికార  పలుకుబడితో విశాఖపట్నంలో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిగా మారాలంటే వ్యక్తి పేరుమీద పాసుపుస్తకం, టైటిల్‌డీడ్, అండంగల్ ఉంటేనే వీలవుతుంది. అయితే ఇవేమీ లేకుండానే వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

 ప్రభుత్వ భూమినికలిపేసుకున్న ఘనులు
 పురిటిపాళెం వెళ్లేమార్గంలో వేసిన అప్‌టౌన్ వింటేజ్ వెంచర్‌లో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధ్రువీకరించటానికి భయపడుతున్నారు. అందులో ఎకరం ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా అందులో ఐదెకరాలకుపైనే ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ జరిపితే అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంద ని అధికారుల అభిప్రాయం.

 బినామీల పేరుతో కొనుగోలు
 అప్‌టౌన్ వెంచర్‌ను రవాణాశాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు కలిసి బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. రవాణా కార్యాలయంలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ఏజెంట్లే బినామీలుగా పెట్టుకున్నట్లు తెలిసింది. ప్లాట్లు దిగువ ప్రాంతంలో ఉండటం.. గూడురు పట్టణానికి దూరంగా ఉంటం.. వర్షం వస్తే ముంపునకు గురవుతుందనే భావనతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు ఎలాగైనా ప్లాట్లను అధిక ధరలకు విక్రయించేందుకు పథకం వేశారు.

 జన సంచారమే లేని చోటుకు ప్రాంతీయ కార్యాలయం
 జన సంచారమే లేని ప్రాంతానికి రవాణా ప్రాంతీయ కార్యాలయాన్ని మార్చారు. ఆ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. పట్టణం ఎక్కడా భవనాలే దొరకనట్టు..గూడూరుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు వ్యక్తి కట్టించిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవన యజమాని కూడా వెంచర్లో ఒక భాగస్తుడని తెలిసింది.

 కొత్త కార్యాలయానికి చేరుకోవాలంటే జాతీయ రహదారి నుంచి కి లోమీటరుకు పైగా లోనికి వెళ్లాలి. అప్‌టౌన్ వింటేజ్‌లో ప్రవేశించాక చిట్టచివర రవాణా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

 కార్యాలయం చివర్లో ఉంటే.. వచ్చే వారంతా ముందున్న ప్లాట్లను చూసుకుంటూ వస్తారు. వందలో కనీసం పది మందైనా ప్లాట్లను కొనుగోలు చేయకపోతారా? అనే భావనతో అధికారులు పథకం ప్రకారమేచివర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.

Advertisement
Advertisement