బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు ఖాయం | Sakshi
Sakshi News home page

బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు ఖాయం

Published Sat, Sep 13 2014 1:46 AM

బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు ఖాయం - Sakshi

తెలంగాణలో టీడీపీకి  భవిష్యత్ లేనట్లే
మోడీ, అమిత్‌షా రాజకీయ కవలలు: జైపాల్‌రెడ్డి

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చివరి నిమిషం వరకు వెంపర్లాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్ ఉంటుందేమో కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం పూజ్యమని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు నాగయ్య, ప్రధాన కార్యదర్శులు నర్సింహారెడ్డి, కుసుమ్‌కుమార్‌లతో కలసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలూ లేవని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రుసరుసలు తాత్కాలికమేనని, త్వరలోనే రెండు పార్టీలూ ఒక్కటవుతాయని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలివ్వడంవల్లే అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తన వంద రోజుల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. పైగా ఆయనపాలనలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వేచ్ఛాపిపాసి అయిన కాళోజీ నారాయణ జయంతి సభలో ‘మీడియా మెడకోస్తా, పాతరేస్తా’ అని వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ప్రధాని నరేంద్రమోడీపైకి సుతిమెత్తగా మాట్లాడుతున్నప్పటికీ దాని వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని ఆరోపించారు. మోడీ-అమిత్‌షా రాజకీయ కవలలని, తాను అనుకున్నదంతా అమిత్‌షా ద్వారా చేయిస్తారని విమర్శించారు.
 

Advertisement
Advertisement