10మంది జలసమాధి? | Sakshi
Sakshi News home page

10మంది జలసమాధి?

Published Sun, Oct 27 2013 6:44 AM

10మంది జలసమాధి? - Sakshi

మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్ : వేగంగా వస్తున్న లారీ.. ఆటోను ఢీకొని చెరువులో బోల్తాపడటంతో పది మంది అక్కడికక్కడే జల సమాధికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియరాలేదు. ఈ సంఘటన పెద్దారవీడు మండలం గొబ్బూరు చెరువు వద్ద శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. రాత్రి 11గంటల సమయానికి ఏడు మృతదేహాలను పోలీసులు అత్యంత కష్టం మీద బయటకు తీశారు. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ లోడుతో లారీ కంభం వైపు వెళ్తోంది.
 
 దాచేపల్లి వద్ద మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది కూలీలు తమ స్వగ్రామం వెళ్లేందుకు లారీపైకి ఎక్కారు. యర్రగొండపాలెంలో పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన ముగ్గురు మిర్చి నారుతో లారీ ఎక్కారు. లారీ గొబ్బూరు వద్దకు రాగానే ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆటోను ఢీకొని ఆ పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా కొట్టింది. రోడ్డున వెళ్లే ప్రయాణికులు గొబ్బూరు గ్రామస్తులు, పెద్దారవీడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
 రాత్రి 11గంటల సమయానికి 3జేసీబీల సహాయంతో లారీని పైకి లేపి చెరువులో ఉన్న కలనూతల గ్రామానికి చెందిన శీలం శ్రీనివాసరెడ్డి(60), చింతగుంట్ల గ్రామానికి చెందిన ఎనిబెర చెన్నయ్య (45), బరిగెల రాజయ్య (4), ఎనిబెర మరియమ్మ (35), బరిగెల నడిపయ్య (45), ఎనిబెర ధర్మయ్య (6), పెద్దారవీడుకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి (50), పాండు రంగారెడ్డి(45)ల మృతదేహాలను బయటకు తీశారు. చింతగుంట్ల గ్రామానికి చెందిన రాయల శారమ్మ, దయామణిలు కొన ఊపిరితో ఉండగా హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
 
 మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐలు ఎ.శివరామకృష్ణారెడ్డి, పాపారావు, ఎస్సైలు దాసరి ప్రసాద్, ఎ.రాజమోహనరావు, త్రిపురాంతకం ఎస్సై శ్రీనివాసరావు, స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు అధికంగా ఉండటంతో మృతదేహాల వెలికితీతకు ఆలస్యమైంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను వైద్యశాలకు తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement