గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి | Sakshi
Sakshi News home page

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి

Published Tue, Feb 4 2014 3:09 AM

trying to develope tribal university

 అందరి కృషి వల్లే ‘నాగోబా’ విజయవంతం
  శివాలయం నిర్మాణానికి కృషి
  వచ్చే యేడు నాగోబా జాతర తెలంగాణలోనే..
  జిల్లా ఇన్‌చార్జి మంత్రి సారయ్య
 
 ఉట్నూర్/ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ :
 కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చామని, అందరూ కలిసి కట్టుగా కృషి చేయ డం వల్లే నాగోబా జాతర విజయవం తం అయిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నా రు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగోబా జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన దర్బార్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య హాజరై మాట్లాడారు. నాగోబా సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ స్టాల్స్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేదికపై వివిధ ఆవిష్కరణలు చేశారు.
 
 నాగోబా ఆలయ అభివృద్ధికి నిధులు వెచ్చించాం.. : మంత్రి సారయ్య
 నాగోబా ఆలయంఅభివృద్ధి పనుల్లో భాగంగా దాదాపు రూ.59 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశామన్నారు. ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి మరో రూ.35 లక్షలు వెచ్చిస్తున్నామని త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ సమీపంలో శివాలయం నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారని, ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. శివాలయం నిర్మాణంలో నాగోబా భక్తుడిగా తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సి మౌలిక వసతులు ఏజెన్సీలో పుష్కలంగా ఉన్నాయన్నారు. అటవీ హక్కుల కల్పనలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్టంలో ఏ జిల్లాలోలేని విధంగా దాదాపు 37 వేలకు పైగా గిరిజనులకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. సబ్‌ప్లాన్ రావడానికి జిల్లా ప్రేరణ అన్నారు. అనంతరం జాతర సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.
 
 సమస్యలు పరిష్కారం కావడం లేదు..  : ఆదివాసీ సంఘాల నాయకులు
 ప్రభుత్వాలు ఎన్ని మారిన ఆదివాసీలు అభివృద్ధి చెందడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. రాజ్యాంగంలో ఆదివాసీల మనుగడకు రూపొందించిన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అధికారులు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు తీసుకురమంటున్నారని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి అన్నారు. 1950 కంటే ముందు ఏజెన్సీలో బతుకుతున్నా ఆదివాసీలకు ఏజెన్సీ ధ్రువీకరణ ప్రతాలు అధికారులు ఇవ్వడం లేదు. కానీ 1976-77 ప్రాంతంలో గిరిజనులుగా గుర్తించబడ్డ లంబాడాలకు 1950 నుంచి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఏలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఆదివాసీలకు ఓటరు లిస్టు ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. దర్బార్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తీర్మాణం చేయాలని ప్రధాన్ పురోహిత్ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క కమ్ము డిమాండ్ చేశారు.
 
  కేస్లాపూర్‌లో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కేస్లాపూర్ సర్పంచ్ నాగ్‌నాథ్ మాట్లాడుతూ నాగోబా ఆలయం సమీపంలోని వడమర వద్ద రూ. 50 లక్షలతో షెడ్లు నిర్మించడం ద్వారా మెస్రం వంశీయుల విడిదికి సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బోజ్జు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలల పిల్లలను ఆశ్రమాలకు తరలించడం వల్ల ఆయా పాఠశాలలు పూర్తిగా మూత పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు ఆర్డీవో రాంచంద్రయ్య, ఏవో భీమ్, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, జీసీడీవో ఇందిరా, ఏఎస్పీ జోయల్ డెవీస్, పీఈటీసీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గుంజాల లిపి అధ్యయన వేదిక కన్వీనర్ జయదీర్ తిరుమల్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్ రావు, నాయకులు రేఖ శ్యాం నాయక్, హరినాయక్, భరత్ చౌహన్, నరేష్, మర్సకోల తిరుపతి, కనక యాదవ్ రావు, తిరుపతి, జమునానాయక్, తుకారం, చంద్రయ్య, మచ్చ శంకరయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు.
 
 రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి కృషి చేశాం
 జిల్లాలో ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు జల్.. జంగల్.. జమీన్ నినాదంలో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసి విజయం సాధించిందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర గవర్నర్‌కు మరో సారి ప్రతిపాదనలు పంపించామన్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలోని నార్నూర్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్ మండలాలకు శాశ్వత తాగునీటి వసతుల కల్పనకు రూ.68 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా మరో రూ.10 కోట్లు వెచ్చించి ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు తాగునీరు అందించేందుకు పనులు చేపట్టడం జరిగిందన్నారు. గుంజాల గ్రామంలో బయట పడ్డ గోండు లిపి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో వాచకంను ప్రవేశపెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి ఐదు యూత్ ట్రెయినింగ్ సెంటర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
 
  ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షలు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగాల భర్తీకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ఉపాధి పథకంలో భాగంగా వంద పని దినాలకు బదులు 150 పని దినాలు గిరిజనులకు కల్పిస్తామన్నారు.              - కలెక్టర్ అహ్మద్‌బాబు
 
 లోటుపాట్లు ఉంటే మన్నించండి..
 నాగోబా జాతర ఏర్పాట్లలో ఏమైన లోటుపాట్లు ఉంటే మన్నించాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ స్పష్టం చేశారు. జాతరకు రోజుకు 70 వేల మంది భక్తులు వచ్చారన్నారు. గతంలో ఇక్కడ గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం డీఎడ్ కళాశాల ఉండేదని, మళ్లీ ఆ కళాశాలను తిరిగి ప్రారంభించేలా ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. - జనార్దన్ నివాస్, ఐటీడీఏ పీవో
 
 సమస్యలపై అధికారులు స్పందించడం లేదు..
 గిరిజన సమస్యలపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించడం లేదు. ఓ ప్రజాప్రతినిధిగా గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిమార్లు చెప్పినా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఏటా గిరిజనులు మృత్యువాత పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి. ఎంతమంది కలెక్టర్లు, పీవోలు వచ్చినా గిరిజనాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 - సుమన్ రాథోడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే
 
 ఆదివాసీ దేవుళ్ల రక్షణకు కమిటీ వేయాలి..
 ఆదివాసీ సంస్కృతి సంరక్షణకు, ఆదివాసీ దేవుళ్ల రక్షణకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కమిటీ వేయాలి. జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ దేవుళ్ల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు.          - ఆత్రం సక్కు, ఎమ్మెల్యే
 

Advertisement

తప్పక చదవండి

Advertisement