కోడ్ కొండెక్కింది! | Sakshi
Sakshi News home page

కోడ్ కొండెక్కింది!

Published Thu, Mar 27 2014 3:11 AM

Trying to various works for votes

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పదవుల కోసం తెలుగుతమ్ముళ్లు బరితెగిస్తున్నారు. ఎలాగైనా ఓట్లను రాబట్టుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తూ జనానికి ఆశలు పుట్టిస్తున్నారు. ఎన్నికల నియమావళిని తుంగలోతొక్కి అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నారు.
 
 అందులో భాగంనే కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లె, ఆదోని తదితర ప్రాంతాల్లో తమ్ముళ్లు కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు, గృహోపకరణాలను పంపిణీ చేస్తున్నారు. పోలీసుల తనిఖీలు, నిఘా వర్గాలను కళ్లుగప్పి గుట్టుగా పనికానిచ్చేస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ కొండెక్కింది.
 
 వేరే పార్టీవైపు వెళ్లకుంటే వారికి నెలనెలా వేతనం
 కర్నూలు, నంద్యాల, శ్రీశైలం పరిధిలో టీడీపీ అభ్యర్థులు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులపై కన్నేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేయటంతోపాటు బెదిరింపులు, కవ్వింపులకు దిగుతున్నారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తకుండా.. వారికి మద్దతు ఇవ్వకుండా ఉంటే ఒకరికి నెలకు రూ.5వేల చొప్పున వేతనం రూపంలో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా మార్చినెల వేతనం ఇచ్చేసినట్లు తెలిసింది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు నెలనెలా వేతనం ఇచ్చి ఆ తర్వాత వారికి మొండిచేయి చూపించనున్నట్లు అభ్యర్థుల సన్నిహితులే చెప్పుకోవటం కనిపించింది. బాగా డబ్బులున్న టీడీపీ నాయకులు ఇప్పటికే సుమారు 500 మందికి వేతనం ఇస్తున్నట్లు తెలిసింది.
 
 శివారు ప్రాంతాల్లో ఎన్నికల వస్తువులు
 నగరాలు, పట్టణ శివారు ప్రాంతంలోని గోదాములు, నివాసాల్లో టీడీపీ నేతలు గృహోపకర వస్తువులు, చీరలను దాచి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. గోదాములు లేనిచోట నివాసాలను అద్దెకు తీసుకుని అక్కడ నిల్వ ఉంచినట్లు పార్టీ వర్గీయులు మాట్లాడుకోవటం కనిపించింది. నిల్వ ఉన్న వస్తువులకు టోకెన్లును ముద్రించినట్లు తెలిసింది.
 
 పచారానికి వెళ్లే టీడీపీ అభ్యర్థులు ఓటరకు అవసరమైన వస్తువుకు సంబంధించి టోకెన్ చేతిలోపెడుతున్నారు. టోకెట్ తీసుకుని నిల్వచేసిన ప్రాంతానికి తీసుకెళ్లి చూపెడితే అతను కోరుకున్న వస్తువును చేతిలో పెట్టి పంపుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు స్పందించి ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా.. అక్రమ నిల్వలు, పంపిణీపై దృష్టిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement