ఆసక్తి రేపిన చర్చలు | Sakshi
Sakshi News home page

ఆసక్తి రేపిన చర్చలు

Published Sat, Oct 26 2013 2:50 AM

Tungabhadra flood water, efficient use

సాక్షి ప్రతినిధి, అనంతపురం : తుంగభద్ర వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, అధికారులు శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన చర్చలు ఆయకట్టు దారుల్లో ఆసక్తి రేకెత్తించాయి. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ నిర్మించాలా.. లేక హెచ్చెల్సీని విస్తరించాలా అనే విషయంపై ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా అధ్యయనం చేయాలని నిర్ణయించడ మొక్కటే ఊరట కలిగించే విషయం.

 తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే అంశంపై మన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా, నీటిపారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌తో కూడిన బృందం, కర్ణాటక భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, రెవెన్యూ, న్యాయశాఖ మంత్రులు శ్రీనివాసప్రసాద్, జయచంద్ర నేతృత్వంలోని బృందం మధ్య శుక్రవారం బెంగళూరు విధానసౌధ కమిటీ హాలులో చర్చలు జరిగాయి.

టీబీ డ్యాంకు వరద వచ్చే సమయంలో హెచ్చెల్సీ కోటా నీటిని తరలించి... బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటే ఆయకట్టుకు సమర్థవంతంగా అందించవచ్చునని మన రాష్ట్ర బృందం ప్రతిపాదించింది. దీనివల్ల డ్యాంపై భారం తగ్గుతుందని, కర్ణాటక రైతులకూ ఉపయుక్తమని వివరించింది.
 
 ఈ విషయంపై విడివిడిగా అధ్యయనం చేస్తామంటూ కర్ణాటక బృందం వెల్లడించింది. ఆతర్వాత అధ్యయన నివేదికలపై చర్చించేందుకు మరోసారి సమావేశం అవుదామని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. మలివిడత సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దామన్న మంత్రి రఘువీరా ప్రతిపాదనకు కర్ణాటక బృందం అంగీకరించింది. కర్ణాటక వైఖరిపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ విషయం తేల్చకుండా కర్ణాటక నాన్చుడు ధోరణితో దాటవేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ‘ఒకడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కు’లా ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
 
 పీఏబీఆర్ కోటాపై కుదరని ఏకాభిప్రాయం.. ‘అనంత’ దాహార్తిని తీర్చేందుకు, పీఏబీఆర్ కుడికాలువ కింద 52 చెరువులకు నీళ్లందించేందుకు టీబీ డ్యాంలో కేసీ కెనాల్ కోటా అయిన పది టీఎంసీలను రివర్స్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు.
 
 హెచ్చెల్సీ కోటా పూర్తయిన తర్వాత పీఏబీఆర్ కోటా నీటిని విడుదల చేసేవారు. కానీ.. రెండేళ్లుగా ఆ నీటిని విడుదల చేయడం లేదు. ఈ అంశాన్ని ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా సమావేశంలో లేవనెత్తారు. రివర్స్ డైవర్షన్ పద్ధతిలో కనిష్టంగా రెండు, గరిష్టంగా మూడు టీఎంసీలను మాత్రమే విడుదల చేస్తామని టీబీ బోర్డు, కర్ణాటక ప్రతినిధులు స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రి రఘువీరా, ఎంపీ అనంత జోక్యం చేసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ కోటాను ఎలాగైనా వినియోగించుకుంటామని, రివర్స్‌డైవర్షన్ పద్ధతిలో పది టీఎంసీలను విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై మరోసారి చర్చిద్దామని కర్ణాటక బృందం దాటవేసింది.
 
 ఎట్టకేలకు స్పందించిన మంత్రి సుదర్శనరెడ్డి
 సమాంతర వరద కాలువపై చర్చల్లో తాను పాల్గొనేది లేదని మొండికేసిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి వైఖరిపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరద కాలువ వల్ల ఆర్డీఎస్‌కు ఎలాంటి నష్టమూ జరగదని తెలంగాణ ప్రతినిధులు కూడా తెగేసి చెప్పడంతో మంత్రి సుదర్శనరెడ్డి ఓ మెట్టు దిగొచ్చి చర్చల్లో పాల్గొన్నారు.
 - ప్రధాన వార్త మెయిన్‌లో
 

Advertisement
Advertisement