సారూ.. ఎండుతోంది మా నోరు! | Sakshi
Sakshi News home page

సారూ.. ఎండుతోంది మా నోరు!

Published Wed, Aug 19 2015 4:56 AM

సారూ.. ఎండుతోంది మా నోరు!

క్యాంపస్‌లో నీటి సమస్య తీవ్రమైంది. రోజువారీ అవసరాలకు కాదుకాదా... కనీసం తాగడానికి కూడా గుగ్గెడు నీరు కరువైంది. 48 గంటలుగా చుక్కనీరు రాకున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. సారూ... ఎండుతోంది నోరు... మమ్మల్ని కాస్త పట్టించుకోరూ.. అంటూ నినాదాలు చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఎస్వీయూ బంద్‌కు పిలుపునిచ్చారు.
- రెండు రోజులుగా మహిళా హాస్టల్‌లో నీటికొరత
- మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన
- నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రిజిస్ట్రార్
- శాంతించని విద్యార్థినులు, నేడు ఎస్వీయూ బంద్
యూనివర్సిటీక్యాంపస్:
ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్‌లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రమైంది. మంగళవారం చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్‌రూమ్‌లో వాడకానికి నీరు లేవు.  దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ల సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. చాలారోజులగా హాస్టల్‌లో ఇదే పరిస్థితి ఉన్నా..  వార్డన్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 1000 మంది ఉన్న హాస్టల్‌లో 9 మంది తాగునీటి కుళాయిలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశా రు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహి ళా హాస్టల్‌లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. దీంతో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. అయినా వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఆందోళనకు వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్ యాదవ్, తేజ, కిశోర్, హేమంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమస్యల పరిష్కరానికి  బుధవారం పరిపాలనాభవనం వద్ద ఆందోళన చేస్తున్నట్లు , యూనివర్సిటీలో బంద్ పాటిస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement