రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Published Wed, May 28 2014 2:36 AM

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం - Sakshi

వృద్ధురాలి మీదినుంచి వెళ్లిన ట్రాక్టర్..
 కేతేపల్లి, న్యూస్‌లైన్ : ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రిస్తున్న వృద్ధురాలి మీదుగా అదే ట్రాక్టర్ వెళ్లడంతో  అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చెర్కుపల్లి ఐకేపీ కేం ద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మనగోటి రాములమ్మ(75) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులనుంచి ధాన్యం యాచించేందుకు మంగళవారం ఐకేపీ కేంద్రానికి వెళ్లింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధాన్యం రాశుల పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టరుట్రాలీ కింద నీడలో విశ్రమించింది. గమనించని ట్రాక్టరు డ్రైవరు ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక్కిపోనిచ్చాడు. రాములమ్మకు వినికిడి లోపం ఉండడంతో ట్రాక్టరు స్టార్టు అయిన విషయం తెలియక అలాగే ఉండిపోయింది. దీంతో రాములమ్మ తలమీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు అందించిన సమాచారంతో కేతేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
 బైక్ పైనుంచి పడి..
 కోదాడ రూరల్, న్యూస్‌లైన్ :  బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో  చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చిత్తలూరి కిరణ్‌కుమార్ (36) తన జేసీబీల పనినిమిత్తం కోదాడకు వచ్చాడు. పని ముగిసేసరికి రాత్రి అయ్యింది.  తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో  కిరణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డువెంట వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని అతన్ని కోదాడకు తరలించి చికిత్స  చేస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు.

Advertisement
Advertisement