సరిహద్దులో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఉద్రిక్తత

Published Sat, Jul 26 2014 2:42 AM

సరిహద్దులో ఉద్రిక్తత - Sakshi

  • ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనుల హతం
  • వారోత్సవాలకు భయాందోళనలు
  • సీలేరు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఎల్‌జీఏ వారోత్సవాల ప్రారంభానికి ముందు మావోయిస్టులు తెగబడ్డారు. ఒక్కసారిగా మన్యంలో వాతావరణం వేడెక్కింది. సరిహద్దులోని ఒడిశా మల్కన్‌గిరిజిల్లా సలిమెల పోలీసు స్టేషన్ పరిధి గొర్రెగుడకు చెందిన ఇద్దరు గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. శుక్రవారం మధ్యాహ్నం సాయుధు మావోయిస్టులు గ్రామంలోకి వచ్చి దొంగ మడకాని, దెబొ మడకానిల గురించి ఆరాతీశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌లుగా వ్యవహరిస్తున్నారంటూ ఇద్దరినీ చంపారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సంఘటనా స్థలంలో ఓ లేఖ వదిలి వెళ్లారు.

    ఈ నెల 28 నుంచి వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. ఒడిశా, ఆంధ్ర పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే వందలాది మంది గ్రేహాండ్స్, బీఎస్‌ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటనతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను ఆరాతీస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మైదానానికి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సీలేరులో ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు.
     
    ఆధార్ సిబ్బంది కిడ్నాప్

    సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మరిగట్టు పంచాయతీలో ఆధార్ నమోదు సిబ్బందిని 15 మంది మావోయిస్టులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. 7 గంటలపాటు నిర్బంధించి అనేక అంశాలను వారితో చర్చించారు. అనంతరం వారి వద్ద ఉన్న 3 ల్యాప్‌టాప్‌లు, 2 ప్రింటర్లను లాక్కుని కొంత దూరం తీసుకొచ్చి వదిలి వెళ్ళారు. అనంతరం ఆధార్ సిబ్బంది కాలిబాటన కలిమెల హెడ్ క్వార్టర్స్‌కు చేరుకొన్నారు.
     

Advertisement
Advertisement