Sakshi News home page

రైతుల గోడు పట్టని బాబు

Published Sat, Apr 9 2016 3:28 AM

రైతుల గోడు పట్టని బాబు - Sakshi

సీపీఐ ఆధ్వర్యంలో ఉగాది దీక్షలు

అనంతపురం రూరల్: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు అల్లాడుతుంటే వారి గోడు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మనువడి పుట్టిన  రోజు వేడుకల్లో నిమగ్నమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు కరువు బాధితులకు సంఘీభావంగా సీపీఐ నాయకులు ఉగాది దీక్షలను చేపట్టారు. దీక్షలో జగదీష్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా తీవ్ర వర్షాభావం నెలకొని వరుస కరువులతో జిల్లా అతలాకుతలమై గ్రామీణ వ్యవస్థ దెబ్బతిందన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక 5 లక్షల మంది కూలీలు, చిన్న, సన్నకారు రైతులు నగరాలకు వలసలు పోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే జిల్లాలో 192 మంది రైతులు అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కరువు జిల్లాగా ప్రకటించడం మినహా సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. దీక్షల్లో మానవహక్కుల వేదిక చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు కేవీ రమణ, సీపీఐ నాయకులు కాటమయ్య, జాఫర్, నారాయణస్వామి, ఎంవీ రమణ, రంగారెడ్డి, రాజారెడ్డి, మల్లికార్జున, లింగమయ్య, కేశవరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement