కొనలేం.. తినలేం | Sakshi
Sakshi News home page

కొనలేం.. తినలేం

Published Sat, Aug 31 2013 5:04 AM

unable to purchase..and eat

ఉదయగిరి, న్యూస్‌లైన్: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సంచి నిండా డబ్బు ఎత్తుకెళ్లినా, సరిపడా సరుకులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాపారులు కృత్రిమ నిల్వలు సృష్టించి నిత్యావసర సరుకుల ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు, రాజకీయ నేతలు వ్యాపారులకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెరిగిన ధరలతో కనీసం ఒక పూటైనా పోషకాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారులు మరింత బరితెగించి ధరలు విచ్చలవిడిగా పెంచేస్తున్నారు.
 
 బియ్యం, పప్పుదినుసులు, నూనె, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర మసాలా దినుసులు, ఒకటేమిటి..సరుకు ఏదైనా వాటి ధరలు చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. రూ.500 తీసుకెళితే చిన్న ప్లాస్టిక్ కవరునిండా సరుకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అధికారులు సన్న బియ్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కేంద్రాల్లో కిలో రూ.28కే అందించేందుకు తెరిచిన దుకాణాలు నేడు ఒక్కటీ కనిపించడం లేదు. నాణ్యమైన సన్నబియ్యం ప్రస్తుతం కిలో రూ.55 పలుకుతోంది. నిత్యం ఉపయోగించే శనగ నూనె రూ.110, పామాయిల్ రూ.65 పలుకుతోంది. కందిపప్పు రూ.75,పెసరపప్పు రూ.76,చక్కెర రూ.40కు చేరింది. చింతపండు రూ.116, మినప్పప్పు రూ.55, వేరుశనగ పప్పు రూ.86, శనగపప్పు రూ.75 ధర పలుకుతోంది.
 
 కొండెక్కిన కూరగాయల ధరలు
 జిల్లా కేంద్రంలో ఏసీ కూరగాయల మార్కెట్‌లో నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్, కడప, చిత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ఎప్పుడూ కిటకిటలాడే ఈ మార్కెట్‌లో ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పదిరోజుల క్రితం రూ.10 పలికిన పచ్చిమిర్చి నేడు రూ.70కి చేరింది. కడప నుంచి దిగుమతి అయ్యే వంకాయలు 15 రోజుల క్రితం కిలో రూ.25 ఉంటే నేడు రూ.65. గత వారంలో కిలో క్యారెట్ రూ.30 ఉండగా నేడు రూ.60కి అమ్ముతున్నారు. కిలో పది పదిహేను రూపాయలు అమ్మే బీరకాయలు, మటిక్కాయలు కూడా రూ.40 పైనే పలుకుతున్నాయి. ఆలుగడ్డలు రూ.30, బీట్‌రూట్ రూ.60, క్యాబేజి రూ.30, గోరుచిక్కుళ్లు రూ.60 పలుకుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. అల్లం ధర ఏకంగా రూ.150కి చేరింది.
 
 కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలు
 వంటల్లో ఉల్లిపాయ ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. అలాంటి నిత్యావసర ఉల్లిపాయ ధర చూస్తే మాత్రం వినియోగదారుడికి గుండె ఆగిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో రోజుకు 20 లారీల వరకు ఉల్లిపాయల వినియోగం ఉంది. వారం క్రితం కిలో రూ.30 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.50కి చేరింది. మేలురకం ఉల్లిపాయలు ఏకంగా రూ.70కి ఎగబాకాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లరగా కొనే వినియోగదారులు వీటి వాడకాన్నే మానేసే పరిస్థితి కనిపిస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ఉల్లిపాయల ధరలతో రోజుకు లక్షల్లో వినియోగదారులపై భారం పడుతోంది.
 
 పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
 నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తదితర కారణాలు చూపుతూ వ్యాపారులు సరుకులు బ్లాక్‌లో నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేస్తున్నారు.
 

Advertisement
Advertisement