ఏ పరీక్ష రాయాలి దేవుడా? | Sakshi
Sakshi News home page

ఏ పరీక్ష రాయాలి దేవుడా?

Published Sat, Dec 29 2018 3:01 AM

Unemployed people are angry on Govt about exams - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఏళ్లతరబడి చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. కోచింగ్‌ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ తలలు పట్టుకుంటున్నారు. 

మూడు పరీక్షలు ఒకే రోజే..
 రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది.

ఎన్నికల హడావిడే కారణం..
ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక  లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఒకే రోజు ఏపీ, తెలంగాణలో పరీక్షలు..
జనవరి 6న నాకు హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్‌ ఎగ్జామ్, అదే రోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఉన్నాయి. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో ఎలా పరీక్ష రాయాలో అర్థం కావటం లేదు. ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్‌ పరీక్షను వాయిదా వేయాలి.
– చిప్పల వెంకటేశ్వరరావు, అభ్యర్థి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా

రెండు వారాలు వాయిదా వేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కానిస్టేబుల్‌ పరీక్షను రెండు వారాల పాట వాయిదా వేయాలి, అదే విధంగా జనవరి 6న డీఎస్సీ పీఈటీ దేహదారుఢ్య పరీక్షకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల కోణంలో కాకుండా నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. 
– సమయం హేమంత్‌ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు

Advertisement
Advertisement