నిరుద్యోగులకు ఏపీ సర్కార్‌ కుచ్చుటోపీ

1 Jun, 2018 03:24 IST|Sakshi

ఎన్నికల ముందర తెరపైకి భృతి

 మేనిఫెస్టోలో రూ. 2 వేలు ఇస్తామని హామీ.. ఇప్పుడు వెయ్యితో సరి..

22– 35 ఏళ్ల లోపువారే అర్హులు

రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు

కానీ పది లక్షల మందికే భృతి పరిమితం

సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగేళ్లుగా ఆ సంగతే మర్చిపోయారు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో నిరుద్యోగులను మచ్చిక చేసుకునేందుకు భృతి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిరుద్యోగ భృతిపై కేబినెట్‌లో చర్చించామని, ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్‌ గురువారం తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలకు కేవలం కొన్ని  నెలల ముందు ఈ భృతిని అరకొరగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రుణ మాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాలను దగా చేసిన తరహాలోనే నిరుద్యోగులకు వంచించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

బకాయి రూ.96 వేలు: రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హామీ ప్రకారం ఒక్కో కుటుంబంలో ఒక్కరికి నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చి 48 నెలలవుతోంది. భృతి కిందా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 48 నెలలకు గాను ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.96,000 చొప్పున బకాయి పడింది.

ఈ సొమ్ము చెల్లిస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.1,000 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. అది కూడా కేవలం 10 లక్షల మందికే ఈ భృతిని పరిమితం చేయాలని నిర్ణయానికొచ్చింది. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.

అర్హుల సంఖ్య కుదింపు: నిరుద్యోగులకు ఆర్థిక సాయం పేరుతో గత ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. భృతి ఇచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించాలంటూ కాలయాపన చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పందించింది. అర్హుల సంఖ్యను వీలైనంత మేర కుదించాలని నిర్ణయించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 22 –35 ఏళ్లలోపు వయసున్న వారే భృతికి అర్హులు. డిగ్రీ చదివిన వారికి మాత్రమే నెలకు రూ.1,000 చొప్పున భృతి అందజేస్తారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు చదివిన నిరుద్యోగులకు భృతి రాదు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి పొందాలంటే రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. స్థానికుడై ఉండాలి.

2.50 ఎకరాలలోపు మాగాణి, 5 ఎకరాలలోపు మెట్ట భూమి కలిగి, దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుద్యోగులకు మాత్రమే భృతి అందుతుంది.4 చక్రాల సొంత వాహనం ఉంటే అనర్హులే. ఒక్కో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే నిరుద్యోగ భృతి వర్తింపజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం లేదా రుణం పొంది ఉంటే భృతికి అనర్హులు. పబ్లిక్, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు అభ్యసించిన వారు భృతికి అనర్హులని ప్రభుత్వం తేల్చేసింది.


రైతులు, డ్వాక్రా సంఘాలకు మొండిచేయి 
రైతుల రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక షరతులు విధిస్తూ వ్యవసాయ రుణ మాఫీని భారీగా కుదించేశారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతుల పేరిట బ్యాంకుల్లో రూ.87,612 కోట్ల అప్పులు ఉండగా, ఇది రూ.24,000 కోట్లేనని ప్రభుత్వం పేర్కొంది. నాలుగేళ్లయినా రూ.24,000 కోట్ల రుణాలను మాఫీ చేయలేదు.

రుణమాఫీ పేరిట విడతవారీగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు ఉన్నాయి. మాఫీ కాదు, పెట్టుబడి రాయితీ అంటూ డ్వాక్రా సంఘాలను బాబు నిలువునా మోసం చేశారు. రుణాలు మాఫీ కాక, వాటిని తీర్చే దారిలేక డ్వాక్రా సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా