కావూరి కక్ష సమైక్యవాదులకు సంకెళ్లేనా ! | Sakshi
Sakshi News home page

కావూరి కక్ష సమైక్యవాదులకు సంకెళ్లేనా !

Published Mon, Dec 30 2013 7:19 AM

Union Minister kavuri sambasiva rao Tour occasion ysr congress party  leaders arrested

 జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులకు, సమ్యైదులకు అరెస్ట్‌లు తప్పటం లేదు. వారు చేసిన తప్పల్లా రాష్టాన్ని ముక్కలు కానీయకుండా ప్రయత్నించమని కోరటమే. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఆదివారం జిల్లా పర్యటన సందర్భంగా ముందుగానే పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేయటాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి. గత నెల 17న చింతలపూడి పర్యటనకు వచ్చిన కావూరి సాంబశివరావును రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్నందున సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించాలని కోరటానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్‌తో పాటు 20 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కావూరి కక్షగట్టి అదే రోజు రాత్రి పోలీసు అధికారులతో మాట్లాడి వారిని అరెస్టుచేసి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశార ని పలువురు విమర్శించారు. 18వ తేదీ ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు నిద్రలేసి మరీ అరెస్టు చేశారు.
 
  రాజేష్‌తో పాటు ఇతర నాయకులను  కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా  చెప్పులు కూడా వేసుకోనీయకుండా నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువె ళ్లారు. ఐపీసీలోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తాజాగా ఆదివారం కేంద్రమంత్రి కావూరి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా ఉదయమే పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తు చర్యగా గృహ నిర్బంధంలో ఉంచటంతోపాటు, పలువురిని అరెస్టుచేసి ప్రైవేట్ గదుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచారు. ఈ తీరుపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రం  ఆగ్రహం వ్యక్తంచేశాయి. కావూరి పర్యటనను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన వైసీపీ నాయకుడు పోల్నాటి బాబ్జీని ఉదయం 6 గంటలకు అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు పోలీసులు. 
 
 కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించటంతో వారు  వెళ్లిపోయారు. అనంతరం ఉదయం 8 గంటలకు  సీఐ, ఇద్దరు ఎస్సైలు, 15 మంది పోలీసులు వచ్చి  బాబ్జిని అరెస్టుచేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ వైసీపీ నాయకులు శ్రీనివాసపురానికి చేరుకుని పోలీస్ వాహనానికి అడ్డంగాపడుకుని సమైక్య నినాదాలు చేసి నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు ూనుకోవాలని నినాదాలు చేశారు. గ్రామస్తులు, వైసీపీ నాయకులు భారీగా చేరుకోవటంతో పోలీసులు చేసేదేమీలేక బాబ్జితోపాటు పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాసరావు, మంగా రామకృష్ణ, పోల్నాటి ఉదయ్‌కుమార్, పంది రాజా, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ వెంకన్న, పోల్నాటి శ్రీను, బుజ్జా పరమేశ్వరరావు, కూనపాం పండు, అడబాల రాంబాబు, కాసర సోమిరెడ్డి, పోల్నాటి చెల్లారావు, బల్లె రామచంద్రరావు, టి.శ్రీను, రాంబాబు, ఎం.హరీష్, శివలను పోల్నాటి బాబ్జిని ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు నిర్బంధంలో ఉంచి తరువాత విడుదలచేశారు. 
 
 చింతలపూడిలో కావూరు పర్యటన సాయంత్రం అయినప్పటికీ వైసీపీ నాయకులను ఉదయం 6 గంటలకే  12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తొలుత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి వారిని పోలీసుల ఆధీనంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారు. జీలుగుమిల్లి మండలంలో వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్‌కుమార్‌తో పాటు ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలిపెట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రజాస్వామ్యబద్ధంగా సమైక్యవాదన వినిపించే వారి నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంగా వైసీపీ నాయకులను అరెస్టుచేయటాన్ని వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. 

Advertisement
Advertisement