మహిళా భేరి | Sakshi
Sakshi News home page

మహిళా భేరి

Published Sun, Sep 15 2013 5:15 AM

united agitation become severe

 సాక్షి, నెల్లూరు :  రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సింహపురివాసులు గర్జిస్తున్నారు. అందుకోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని నినదిస్తున్నారు. జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన ఉద్యమం శనివారానికి 46వ రోజుకు చేరింది. సమైక్య ఉద్యమకారులపై ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి దాడులు చేయించడాన్ని ఆయన సోదరుడు  జయకుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. షర్మిలపై విమర్శలు చేయడం తగదని వివేకాకు హితవు పలికారు.  ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని జయకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపై వంటావార్పుతో పాటు గంగిరెద్దులతో ఆటలు ఆడించి వినూత్న నిరసన తెలిపారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు వెంకటగిరిలో శనివారం బంద్ పాటించారు.
 
 గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, ఆర్టీసీ, విద్యాలయాల బంద్ కొనసాగుతోంది. సింహపురి మహిళా గర్జన పేరుతో సర్వోదయ కళాశాల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు  ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి.  కృష్ణం పల్లె పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్‌లో 27వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. సీతారాంపురంలో ఒక ఉపాధ్యాయుడు అరగుండు గీయించుకుని  నిరసన వ్యక్తం చేశాడు.
 
 వెంకటగిరికి వచ్చే ప్రధాన ముఖద్వారాలను దిగ్బంధించారు. పట్టణంలోకి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పుర వీధులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూసి వేశారు. ఆత్మకూరు ఆపస్  ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, జేఏసీ మహిళలు సోమశిల టర్నింగ్ నుంచి ర్యాలీగా బస్టాండ్ సెం టర్ వరకు వెళ్లి మానవ హారంగా ఏర్పడ్డారు. సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏఎస్‌పేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సోమశిలలో గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె ప్రారంభించారు.
 
 ముత్తుకూరులోని సాంఘిక సం క్షేమ గురుకుల కళాశాల ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్షలు , విద్యార్థులు మానవహారం నిర్వహించారు. టీపీగూడూరు మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నేతలు టీపీ గూ డూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. డీఈఓ రామలిం గం ఈ యాత్రను ప్రారంభించారు.
 చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెంలో ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటా సమైక్యాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి దీక్షలో పాల్గొన్నారు.
 
 కోటలో ముస్లిం మతపెద్దలు సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. మల్లాం గ్రామంలో ఆర్టీసీ, విద్యార్జి జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు, రైతులు, ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మహాగర్జన నిర్వహించారు.  సూళ్లూరుపేటలో జేఏసీ రిలే నిరాహారదీక్షలు 35వ రోజుకు చేరాయి. తడలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సం జీవయ్య వారికి సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో స్వర్ణముఖి గర్జన నిర్వహించేందుకు డీఈఓ మువ్వా రామలింగం ఏర్పాట్లు పరిశీలించారు.

Advertisement
Advertisement