64వ రోజూ కొనసాగిన సమైక్య నిరసనలు | Sakshi
Sakshi News home page

64వ రోజూ కొనసాగిన సమైక్య నిరసనలు

Published Thu, Oct 3 2013 4:48 AM

United in the 64th day of protests

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు 64వ రోజైన బుధవారం కూడా శాంతియుతం గా ఆందోళనలు నిర్వహించారు. నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వివిధ ఉద్యోగ సం ఘాల నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్‌లో నిర్వహించిన నారీ-భేరి కార్యక్రమం విజయవంతమైంది. వేలాది మంది మహిళలు కార్యక్రమంలో పాల్గొని సమైక్య రాష్ట్రం సాధించే వరకు పోరాటం సాగిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక రూపకాలు తెలుగు దనాన్ని ప్రతిబింబించాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. 
 
 మున్సిపల్ ఉద్యోగులు గంటస్తంభం జంక్షన్‌లో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేయగా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మౌన ప్రదర్శన చేశారు. సమైక్య విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు ఇతర నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎంఆర్ యునెటైడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయోధ్య మైదానంలో 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్‌లో మహాత్మా గాంధీ వేషధారి ముందు సోనియా, సీమాంధ్ర మంత్రుల మాస్కులు ధరించిన వ్యక్తులను సంకెళ్లతో బంధించి నిరసన తెలిపారు. న్యాయశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందు గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. 
 
 నెల్లిమర్లలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటంతో  శాంతి ర్యాలీ నిర్వహించారు. భోగాపురంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. డెంకాడ నుంచి తాడి వాడ జంక్షన్ వరకు ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. చీపురుపల్లిలో కాంప్లెక్సు ఎదుట ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో,  తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీఓ ఉద్యోగులు, కోర్టు వద్ద కోర్టు ఉద్యోగులు దీక్షా శిబిరాలు కొనసాగిస్తున్నారు. గజపతినగరంలో జేఏసీ, ఎన్జీఓల ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు జరిగాయి. ఎస్.కోట జేఏసీ ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సాలూరులో జేఏసీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ జయంతిని పురస్కరించుకుని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
 బొబ్బిలిలో ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు రిలే దీక్షకు వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త  సుజయ్ కృష్ణరంగారావు సంఘీభావం ప్రకటించారు. రామభద్రాపురంలో సమైక్యవాదులు 500 అడుగుల జాతీయ జెండాతో నిరసన చేయగా.. పార్వతీపురంలో రాష్ట్రీయ రహదారిపై హెచ్.కారాడవలస గ్రామస్తులు రాస్తారోకో చేసి వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. బెలగాంలో ఏపీఎన్‌జీఓ ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు ప్రధాన రహదారిలో ర్యాలీ  చేయగా.. సీతానగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. కురుపాంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు.
 
 నేడు ఎంపీల ఇళ్ల ముట్టడి...
 రాష్ట్ర నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో 3,4 తేదీల్లో కురుపాం లోని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్, విజయనగరంలో ఎంపీ బొత్స ఝాన్సీ ఇళ్లను ముట్టడించనున్నారు. 5న జాతీయ రహదారుల దిగ్బంధం, 5, 6 తేదీల్లో పెట్రోల్ బంకుల మూసివేత ఉంటుంది.10,11తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నారు.
 

Advertisement
Advertisement