ముప్ఫైరోజులైనా జోరు తగ్గని పోరు | Sakshi
Sakshi News home page

ముప్ఫైరోజులైనా జోరు తగ్గని పోరు

Published Fri, Aug 30 2013 12:46 AM

United stir continues on the 30th day

 సాక్షి, రాజమండ్రి : విభజించి లాభం పొందాలనే కుతంత్రంపై ‘తూర్పు’ కన్నెర్ర కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ ఏలికల దుర్నీతిపై జిల్లావాసులు ఒక్కొక్కరు ఒక్కో నిప్పుకణికలా మారి ముప్ఫైరోజులైనా వారిలో కాక అణుమాత్రం తగ్గలేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం రగిలి గురువారం నాటికి నెల రోజులు పూర్తయింది. అయినా ఉద్యమం రోజు రోజుకూ ఉద్ధృతం అవుతూ,  కొత్తపుంతలు తొక్కుతూ వస్తోంది. ప్రజలే నేతలుగా, సమైక్యత తప్ప వేరు భావన లేకుండా పోరు సాగుతోంది. ‘ఆత్మహత్యలు మా నైజం కాదు.. ఆత్మస్థైర్యమే మా యిజం’ అంటూ విద్యార్థులు, యువకులు గాంధేయ మార్గాల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మహాత్ముడు ఆదర్శంగా సత్యాగ్రహాలు, అమరజీవి స్ఫూర్తితో నిరాహార దీక్షలను సాగిస్తూ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపింప చేస్తున్నారు. ప్రాణాలైనా పణంగా పెడతాం తప్ప రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం అంటున్నారు.
 
 కాకినాడలో జేఎన్‌టీయూకే విద్యార్థులు డి.శ్రీనివాస్, ఎం వెంకటేశ్వర్లు, ఎం.లోకేష్, జి.అనిల్‌కుమార్, అనిల్‌కుమార్, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్‌లో చందు యూత్ ఆధ్వర్యంలో చందు, ప్రసాద్, కృష్ణంరాజు, శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షలు  రెండో రోజైన గురువారం కూడా జరిగాయి. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పంచాయతీ బుచ్చియ్యనగర్‌లో ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గిరజాల చంద్రశేఖర్ గురువారం ఆమరణ దీక్ష ప్రారంభించాడు. ముమ్మిడివరంలో యువకుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆస్పత్రికి తరలించారు.
 
 విజయవంతంగా బంద్
 హైదరాబాద్‌లో జేఏసీ నేతలపై తెలంగాణవాదులు అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా జేఏసీ పిలుపునిచ్చిన బంద్ జిల్లాలో గురువారం విజయవంతమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార వర్గాల జేఏసీలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించిన సమైక్య వాదులు రహదారులపై ర్యాలీలు చేపట్టి సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. రాజమండ్రిలో జేఏసీ చేపట్టిన రెండు రోజుల సకల జనుల సమ్మె జయప్రదంగా ముగిసింది.
 
 ఐక్యతే బలమని చాటిన కలాలు
 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరం వద్ద.. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్వంలో కవి సమ్మేళనం జరిగింది. పలువురు కవులు సమైక్యాంధ్ర ఆవశ్యకతను, ఐకమత్యం ఇచ్చే బలాన్ని, అభివృద్ధిని తమ కవితల్లో చాటారు. సమైక్యతను చాటుతూ విజయలక్ష్మి వినిపించిన కవిత జేజేలు అందుకుంది. పశువుల ఆస్పత్రి వద్ద ఆ శాఖ ఉద్యోగినులు తెలుగుతల్లి వేషధారణతో నిరసన దీక్షలు చేపట్టారు. పిఠాపురంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం, వీఆర్వోలు, మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరాహార శిబిరాల్లో తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు.
 
 జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటీ నుంచి జేఎన్‌టీయూకే వరకూ బైక్ ర్యాలీ చేశారు. కోనసీమ మండలాల నుంచి ఉపాధ్యాయులు ముందు అమలాపురం చేరుకుని అక్కడి నుంచి సమైక్య నినాదాలతో కాకినాడ వచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారులు కూడా కాకినాడలో ర్యాలీ చేశారు. మలికిపురంలో ర్యాలీని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మను.. రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమతో భాగస్వాములైతేనే ర్యాలీని ప్రారంభించేందుకు అంగీకరిస్తామని చెప్పడంతో ఎమ్మెల్సీ వెనుదిరిగారు.
 
 రాజాకు విద్యార్థుల సంఘీభావం
 రాజమండ్రిలో గురువారం సిమెంటు వర్తకుల సంఘం సభ్యులు నగర వీధుల్లో ర్యాలీ చేసి కంబాలచెరువు వద్ద జక్కంపూడి రాజా దీక్షకు మద్దతు పలికారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రదర్శన చేసి రాజాకు సంఘీభావం తెలిపారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల బస్సులతో నగర వీధుల్లో ర్యాలీ చేశారు. వ్యాపారులు మెయిన్‌రోడ్డులోని శాంతినివాస్ సెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి రిలే దీక్షలు చేశారు. కడియం మండలం పొట్టిలంక నుంచి వేమగిరి వరకూ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పాదయాత్ర చేశారు. అమలాపురంలో కొబ్బరి ఒలుపు, దింపు కార్యికులు ర్యాలీ చేసి గడియారస్తంభం సెంటర్‌లో రాస్తారోకో చేశారు.
 
 పశువులతో రహదారి దిగ్బంధం
 అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను నిలిపి దిగ్బంధం చేశారు. రాజోలులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేశారు. ముమ్మిడివరలో విద్యార్థులు రోడ్డుపై ఖోఖో, కబడ్డీ ఆడి రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ర్యాలీలు చేశాయి. మామిడికుదురు, అయినవిల్లి గ్రామాల్లో యూటీఎఫ్ రిలే దీక్షలు చేపట్టింది. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద సమైక్యవాదులు ఉట్టి కొట్టి కృష్ణాష్టమి వేడుకలు చేశారు. ఏలేశ్వరం జూనియర్ కళాశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రాజానగరంలో జాతీయ రహదారిపై జర్నలిస్టు సంఘాలు, జేఏసీ ప్రతినిధులు కలిసి వంటా వార్పు చేశారు. అనపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు

Advertisement

తప్పక చదవండి

Advertisement