వర్సిటీలో వసూళ్ల కలకలం! | Sakshi
Sakshi News home page

వర్సిటీలో వసూళ్ల కలకలం!

Published Fri, Jan 31 2014 1:49 AM

వర్సిటీలో వసూళ్ల   కలకలం! - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ‘యూజీసీ స్కేల్ ప్రకారం జీతం కావాలా.. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో జారీ చేయించాలి.. దీనికోసం ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వండి.. సీఎం దగ్గరి బంధువుకు రూ.30 లక్షలిస్తే పనైపోతుంది. తొందర పడండి.. రాష్ట్ర విభజన వివాదం వల్ల ఎక్కువ సమయం లేదు మరి..’- ఇవీ బీఆర్‌ఏయూలో కొందరు సీనియర్ టీచింగ్ అసోసియేట్లు తమ సహచరులకు చెబుతున్న మాటలు. వీటిని నమ్ముతున్న కొందరు సొమ్ము సమర్పించటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వర్సిటీలో ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది.
 
 ఇదీ సంగతి..
 బీఆర్‌ఏయూలో 12 మంది రెగ్యులర్ బోధకులు ఉండగా 60 మంది టీచింగ్ అసోసియేట్లు కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు. పీహెచ్‌డీ, ఎంఫిల్ తదితర విద్యార్హతలను బట్టి వీరికి నెలకు రూ.18 వేల నుంచి రూ.21 వేల వరకు చెల్లిస్తున్నారు. ఏడాదికి 11 నెలలే వేతనం ఇస్తున్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్లలో వేతనాల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతులు లేకపోవటంతో వర్సిటీ నిధులు వెచ్చిస్తున్నారు. వీరికి యూజీసీ స్కేల్ ప్రకారం వేతనమివ్వాలని ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక జీవో విడుదల చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేసిక్ అని డిజిగ్నేషన్ మార్చి రూ.40 వేల వరకు చెల్లించవచ్చు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఇలా చేస్తున్నారు.
 
 ప్రస్తుతం దీన్నే తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు సీనియర్ టీచింగ్ అసోసియేట్లు. ఒక్కొక్క టీఏకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇస్తే ఆ జీవో జారీ చేయిస్తానని సీఎం కిరణ్ దగ్గరి బంధువు హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన వివాదం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎక్కువ సమయం లేదని.. వారంలోగా సొమ్ము ఇస్తే పనైపోతుందని ఒత్తిడి తెస్తున్నారు. ఆర్థికంగా ఉన్న టీఏలు వెంటనే ఇచ్చేందుకు సమాయత్తమవగా మరికొందరు అప్పు చేసయినా సరే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలా 30 మంది వరకు సొమ్ము ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొందరు మాత్రం జీవో జారీ సాధ్యం కాదంటూ వెనకడుగు వేస్తున్నారు. మరికొందరు టీఏలు.. ఏం చేయమంటారంటూ సీనియర్ ప్రొఫెసర్ల సలహా అడుగుతున్నారు. జీవో కచ్చితంగా వస్తుందని హామీ ఉంటే ఆ మాత్రం సొమ్ము ఇవ్వటంలో తప్పేంలేదని వారు చెబుతున్నారని తెలిసింది.
 
 రెగ్యులర్ నియామకాలు జరిగితే అసలుకే మోసం
 వర్సిటీలో 34 మంది రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో మరో 15 పోస్టులనూ భర్తీ చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరిగితే టీచింగ్ అసోసియేట్లను తొలగించటం ఖాయం. అదే జరిగితే అసలుకే మోసం వస్తుందని కొందరంటున్నారు. అంతేకాకుండా వర్సిటీలో టీచింగ్ అసోసియేట్ల నియామకాలు చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. పూర్వ వీసీలు, రాజకీయ నాయకుల సిఫారసులకు పెద్దపీట వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై చర్య తీసుకున్నా దెబ్బతినటం ఖాయమంటున్నారు.
 
 అది సాధ్యం కాదు
 ఈ విషయమై రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ప్రస్తుత పరిస్థితుల్లో టీచింగ్ అసోసియేట్లకు యూజీసీ స్కేల్ అమలు చేయటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉన్నత విద్యాశాఖ జీవో ఇవ్వటం న్యాయపరమైన చిక్కులతో కూడుకున్న అంశమని పేర్కొన్నారు. బీఆర్‌ఏయూలో కొన్ని డిపార్ట్‌మెంట్లకు బడ్జెట్ మంజూరు లేదని, టీఏల నియామకంలో రోస్టర్ పాటించలేదని వెల్లడించారు. జీవో జారీ చేస్తే భవిష్యత్తులో వారిని రెగ్యులర్ చేయాల్సి వస్తుందన్నారు. జీవో జారీ చేయిస్తామంటూ కొందరు సొమ్ము వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు.

Advertisement
Advertisement