పొగచూరిన బతుకులు | Sakshi
Sakshi News home page

పొగచూరిన బతుకులు

Published Mon, Dec 8 2014 3:34 AM

పొగచూరిన  బతుకులు

బీడీ కార్మికులు... రెక్కాడితేగానీ డొక్కాడని వారు..ప్రతి రోజూ కుటుంబం యావత్తూ కష్టపడినా దక్కే ప్రతిఫలం అంతంతే.. వెయ్యి బీడీలు చుడితే వచ్చే కూలీ రూ. 150 మాత్రమే.. ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమ పథకాలు వీరికి ఏ మాత్ర ం అందడం లేదు.. ఇల్లు, పింఛన్, ఇన్సూరెన్స్  ఇలా ఒక్క సౌకర్యాన్ని కూడా వీరు పొందలేకపోతున్నారు.. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. రోజురోజుకూ వీరి కష్టం పెరుగుతుందేగానీ వీరి జీవితాల్లో మార్పు కానరావడం లేదు... దుర్భర పరిస్థితుల్లో జీవితాలను వెల్లదీస్తున్న బీడీ కార్మికులను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పలుకరించారు.. వీఐపీ రిపోర్టర్‌గా మారి వారి పరిస్థితులను చూసి చలించిపోయారు.
 
 అసెంబ్లీలో గళమెత్తుతా...
 బీడీ కార్మికులు దుర్భర  పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.. వీరి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా.. చాలీచాలని కూలీలతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.. కుటుంబం యావత్తూ కష్టపడి బీడీలు చుట్టినా వచ్చే కూలీ అంతంత మాత్రమే.. వీరి పిల్లలు చదువులకు నోచుకోవడం లేదు.. జిల్లాలోని వేల బీడీ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.. చేనేత కార్మికుల తరహాలోనే వీరికి కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.. బ్యాంకులు వీరి బాగోగుల గురించి  పట్టించుకోవాలి. ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి.. బీడీలు చుడుతుండటంతో టీబీ, ఆయాసం వంటి వ్యాధులకు గురవుతున్నారు.. వీరికోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి.. ఇల్లులేని వారికి పక్కా
 గృహాలను మంజూరు చేయాలి..
 - రవీంద్రనాథ్‌రెడ్డి
 ఎమ్మెల్యే, కమాలపురం
 
 తెల్లారకముందే ఆ నిరుపేద మహిళలు తమ రోజువారి పని ఆరంభిస్తారు. కాసిన్ని టీ నీళ్లు గొంతులో పోసుకుని పద్మాసనం వేసి... సగం పొగాకు నిండిన చాటను తీసుకుని పని మొదలెడతారు.. ఆకు చుట్టడం.. పొగ చూరడం..  ఇంతే రోజంతా ఇదే పని.. 8 గంటలు..9,10.....1, 2 ఇలా గడియారంలో ముళ్లు తిరుగుతూనే ఉంటుంది... గంటలు గడుస్తూనే ఉంటాయి. అయినా లేవరు. కడుపులో పేగులు సిగ్నల్ ఇస్తున్నా గుక్కెడు మంచినీళ్లతో దాహం తీర్చుకుంటూ.. అలాగే కడుపుమాడ్చుకుంటూ పనిలో నిమగ్నమవుతుంటారు. టీ..టీఫెన్ కాదుకదా.. ఒక్కోసారి మధ్యాహ్నం అన్నానికీ లేవరు.. ఇలా రోజంతా పనిచేస్తేగానీ ఆ పూట తిండికి సరిపోయే కూలిరాని పరిస్థితి వారిది. వేళకు అన్నం తినకపోయినా..  ఈ పనితో రోగాలు వస్తాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన దుస్థితి. ఇలా ఒకటి రెండు కాదు దశాబ్దాల తరబడి అదే వారి జీవితం. బీడీ కార్మికుల వ్యథ ఇది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి వీఐపీ’ రిపోర్టర్‌గా మారి వారిని పలకరించినప్పుడు వారు వెల్లబుచ్చిన ఆవేదనకు అక్షరరూపం ఇది.
 
 ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి : నమస్తేమ్మా...! బీడిలు మీరు తయారు చేస్తారా? మిమ్మిల్ని ఎవరైనా పట్టించుకున్నారా??
 పుల్లమ్మ : అవును సార్.. మేం తయారు చేసుకోవాలి.  మా గురించి ఎవరూ పట్టించుకున్నోళ్లే లేర్సార్.
 ఎమ్మెల్యే: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏవైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా?
 ప్యారిజాన్ : ఏమొచ్చాండాయో తెలీదు సార్....హాస్పిటల్‌కు వెళ్లాలన్నా రూ. 50 పెట్టి అదేదో ఈఎస్‌ఐ ఆస్పత్రి అంటా...అక్కడికి వెళ్లాలి. ఎక్కువ లెక్క ఛార్జీలకు పెట్టి పోవాలా! ప్రభుత్వమేమో కనీసం పింఛన్ కూడా ఇయ్యకపోయే! అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పలకకపోయే...
 ఎమ్మెల్యే: బీడి చుట్టడానికి ఆకు ఎవరిస్తారు? ఎంత ఖర్చు వస్తుంది? కార్మికులకు బీడి చుట్టడం వల్ల ఏమైనా జబ్బులు వస్తున్నాయా?
 రఫీయున్ : ఎందుకులే సార్...చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. ఉబ్బసం, దగ్గు, ఆయాసం లాంటి జబ్బులు వస్తాయి. మాకు వచ్చే నూరు, నాట యాభైతో కష్టపడతాండాం! కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆకు, ఇతర సరుకు కంపెనోళ్లే ఇస్తారు. బీడీలు చుట్టి ఇస్తే కూలీ ఇస్తారు.
 ఎమ్మెల్యే: ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? అందరికీ సొంత ఇల్లు ఉన్నాయా?
 రబియా : చాలామందే ఉంటారు సార్....200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. ప్రతిరోజు పొద్దస్తమానం కష్టపడతాం...బీడీలు చుడతానేం ఉంటాం! స్వంత ఇల్లు అందరికీ లేవు సార్, ఏదో వచ్చినోళ్లకు వచ్చినాయ్..రానోళ్లకు రాలే...
 ఎమ్మెల్యే: బీడి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఎంతమందికి పని  కల్పిస్తున్నారు?  
 ఇర్ఫాన్‌బాష (వంకాయ ఫేమస్‌బీడి ప్రతినిధి) : కమలాపురం చుట్టుపక్కల పల్లెల్లో సుమారు 10 కంపెనీలు ఉన్నాయండి...మా అబ్బ కాలం నుంచి చాలామంది బీడీలు చుడుతున్నారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. బిజినెస్ భారీగా పడిపోయింది. 500 కుటుంబాలకు పైనే బీడీలు చుడుతున్నారు సార్!
 ఎమ్మెల్యే: మీరు ఎన్నేళ్ల నుంచి బీడీలు చుడుతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రోజుకు ఎన్ని చుడతారు..?
 షేక్ షమీమ్ బేగం : మేము 30 ఏళ్ల నుంచి బీడీలు చుడుతున్నాం...పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు చుడుతూనే ఉంటాం. కనీసమంటే వెయ్యి బీడీల వరకు చుడతాం.కంపెనోళ్లు 100 నుంచి 150 రూపాయలు ఇస్తారు. మాకు కూడా సమస్యలొచ్చి అక్కడ, ఇక్కడ తిరుగుతున్నాం. జబ్బులు వస్తుండడంతో ఈఎస్‌ఐ ఆస్పత్రికి కూడా పోయి వచ్చాం. బీడి కార్మికులకు పింఛన్ వచ్చేలా చూడండి సార్.
 ఎమ్మెల్యే: మీ కుటుంబంలో ఎంతమంది పనిచేస్తున్నారు? అందరూ చేస్తారా? రోజుకు ఎంత సంపాదిస్తారు?
 మాబున్నీ : సార్, మేమే 37 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తాండాం. మేము తొమ్మిది మంది ఉన్నాం. పిల్లోళ్లు చదువుకుంటాండారు. స్కాలర్‌షిప్పులు కూడా సక్రమంగాా రాలే! రోజూ బీడీలు చుట్టినా రూ. 200-300 కంటే ఎక్కువ రాలేదు. ఒక్కొసారి కుటుంబ ఖర్చులకే అంతా సరిపోతాంది.
 ఎమ్మెల్యే: (బజారులో బండమీద కూర్చొని బీడీలు చుడుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి) : ఎప్పటినుంచి వృత్తిలోకి వచ్చారు? ప్రభుత్వం సబ్సిడీ లాంటివి ఏమైనా సాయం చేసిందా?
 ఇబ్రహీం బాష : ఎవరు అడుగుతారు సార్... బీడి కార్మికులను ఎవరూ పట్టించుకోలేరు. దారుణం సార్.బాడుగ ఇళ్లలో ఉన్నాం. అంతా ఎలచ్ఛన్లపుడు వస్తారు. చెబుతారు...పోతారు...ఏమి చేయరు సార్...ఓటుకోసం అందరూ వస్తారు...నేను 30 ఏళ్ల నుంచి చుట్టిచుట్టి పడతాండ. ఏ పభుత్వం చిల్లిగవ్వ ఇయ్యలే...ఇంకే చేస్తారులే సార్.
 ఎమ్మెల్యే: (సమీపంలో ఉన్న డాక్టరు సురేష్‌బాబునుద్దేశించి) : ఏమయ్యా డాక్టర్...బీడీలు చుట్టి చుట్టి ఆరోగ్యాలు పాడవుతున్నాయి...వీరికి ఏమేం జబ్బులు ఉన్నాయో ఓసారి చెప్పండి?
 డాక్టర్ సురేష్‌బాబు : సార్, బీడి కార్మికులు రోజూ పొగాకు చుట్టడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధింధించిన జబ్బులతోపాటు ఇతరత్రా సమస్యలు వస్తున్నాయి. కార్మికులు జాగ్రత్తలు పాటించాలి. బీడి కార్మికులకు సపరేటు ఆస్పత్రి ఉండడంతో అంతా ఈఎస్‌ఐకి వెళతారు.
 ఎమ్మెల్యే: ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ బీడీలు చుడతారా?
 మాబుజాన్ : నేను 40 ఏళ్ల నుంచి చుడుతున్నా. మా ఇంట్లో తొమ్మిది మంది ఉన్నాం. నేనొక్కదాన్నే చుట్టిన బీడీలపై వచ్చే సొమ్ముతోనే ఇంట్లో జరగాలి.
 ఎమ్మెల్యే: బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ప్రభుత్వం కడుతుందా?
 ఎస్.ప్యారీజాన్ : ఏమి రాలేదు సార్...పింఛన్ రాలేదు. బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ఎవరిస్తారు సార్, ప్రభుత్వం చెప్పినోళ్లకే చేయలేదు. మాకేమి ఇన్స్యూరెన్స్ డబ్బులు కడతారు సార్.
 ఎమ్మెల్యే: (సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో) : చిన్నా..బాగున్నావా...? నీవేం చేస్తావు..అమ్మా నాన్న ఏం చేస్తారు?
 గౌసియా : సార్...నేను చదువుకుంటున్నా...అమ్మానాన్న లేరు. చనిపోయారు. మా అక్క ఒక్కతే కష్టపడి నన్ను సూలుకు పంపుతాంది. అక్క సంపాదనతోనే నేను చదువుకుంటాండా. అక్క కూడా చదువు చాలిచ్చింది సార్.
 ఎమ్మెల్యే: చనిపోతే బీడి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా వస్తోందా?
 గౌసియా : ఒక్కపైసా కూడా రాలేదు. వైద్య సేవలు కూడా సక్రమంగా అందలేదు.
 ఎమ్మెల్యే: చేనేత పింఛన్ 50 ఏళ్లకే ఇస్తున్నారు. బీడి కార్మికులకు ఏమైనా ఇస్తున్నారా? బ్యాంకుల్లో రుణాలివ్వలేదా?
 ఖుర్షీద్ : ఎవరూ ఏమి చేయలేదు..డ్వాక్రాలో ఉన్నా సక్రమంగా రుణాలు రాలేదు. ఇక బీడీ కార్మికులకు ఏం ఇస్తారు సార్? బ్యాంకులకు వెళుతున్నా ఈ రుణాల గురించి ఎవరూ అడగరు..మాట్లాడరు.....
 ఎమ్మెల్యే: (ఇంటి బయట పాపను ఒళ్లో కూర్చొబెట్టుకుని మాట్లాడుతన్న తల్లితో) : మీ పాపనా అమ్మా....ఏం చదువుతోంది తల్లీ?
 నూర్ : అవును సార్..మా పాపే....చిన్నప్పుడే ఇబ్బంది జరిగి వికలాంగురాలిగా మారిందిసార్....100 శాతం వికలాంగురాలిగా డాక్టర్లు సర్టిఫికెట్లు ఇచ్చినా పింఛన్ ఇవ్వలేదు సార్!
 ఎమ్మెల్యే: మీరేం చేస్తారు? బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం ఆదరించింది?
 మాబుసాబ్ : బీడి కార్మికులకు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి.  ఆ మహానుభావుడు వైఎస్సార్ ఉన్నప్పుడే ఇల్లు, పింఛన్లతోపాటు ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు ఒక కార్డు ఇచ్చినాడు. ఇప్పుడెవరు పట్టించుకుంటాడారు సార్...మాలాంటి చదువు రానోళ్లను తోచేస్తాండారు.  
 

Advertisement
Advertisement