యూరియా పక్కదారి | Sakshi
Sakshi News home page

యూరియా పక్కదారి

Published Sun, Jan 25 2015 1:23 AM

యూరియా పక్కదారి

వెంకటాచలం: రైతులందరికీ సక్రమంగా అందాల్సిన యూరియాను అధికారపార్టీ అండతో కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులు రోజులకొద్దీ క్యూలలో నిల బడిన బస్తా కూడా యూరియా దొరకని పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది. కానీ కొందరు అధికారపార్టీకి చెందిన వారికి మాత్రం లారీల కొద్దీ యూరియా సునాయసంగా ఇళ్లకు చేరుతోంది. ఈ దారుణాన్ని వెంకటాచలం మండలంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు శనివారం వెలుగులోకి తీసుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే.. లారీలో యూరియాను తరలిస్తుండగా వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అనుమానంతో మండల కేంద్రంలోని కసుమూరు రోడ్డు వద్ద అడ్డుకున్నారు. లారీ డైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదుచేశారు. లారీని అడ్డుకోవాలని, అక్కడకు తమ సిబ్బందిని పంపుతున్నట్లు ఏడీ సత్యవాణి తెలిపారు. ఈలోపే సంఘటనా స్థలానికి కనుపూరు, వడ్డిపాళెం గ్రామానికి చెందిన కొందరు వచ్చి లారీలోని యూరియా తమేదేనని, వెంటనే లారీని పంపించాలని వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విషయం తెలిసి స్థానిక ఎస్‌ఐ రహమతుల్లా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా రైతులు తమ వద్ద ఉన్న బిల్లులు చూపారు. ఆ బిల్లులు పక్కనే ఉన్న మనుబోలు మండలంలోని సింహపురి కోఆపరేటివ్ సొసైటీవని గుర్తించారు. వ్యవసాయాధికారి రమణ పరిశీలించి రైతులు ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేయవచ్చునని వారికే వంతపాడారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సొసైటీ కింద రైతులకు అవసరం లేదా? బడా రైతులు లారీలకు లారీలు తీసుకెళ్తే చిన్నకారు రైతుల పరిస్థితి ఎమిటని నిలదీశారు.

దీంతో అక్కడకు చేరిన మిగతా చిన్నకారు రైతులు ఏఓ రమణతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఏడీతో మాట్లాడిన ఏఓ ఎరువులు అమ్మిన సొసైటీ నిర్వహకులపైన చర్యలకు సిపార్సు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల బిల్లులను పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తామని సర్దిచెప్పారు. అనంతరం లారీలో యూరియాను కనుపూరు గ్రామానికి తరలించారు. ఇదేవిధంగా మండలంలోని కసుమూరు, పాలిచెర్లపాడు, చవటపాళెం, గుడ్లూరివారంపాళెంలకు లారీల్లో యూరియా వెళ్లినట్లు స్థానిక రైతులు తెలిపారు.
 
రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు
గ్రామాల్లోని చిన్నకారు రైతులకు ప్రభుత్వం సొసైటీ ద్వారా అందజేస్తున్న యూరియాను పక్కదారిన మళ్లించి బడారైతులకు అధికారులు సహకరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య విమర్శించారు. రైతులు సొసైటీల వద్ద యూరియా కోసం రాత్రి, పగలు వేచి ఉంటే వారి భాధలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలోని పలుగ్రామాలకు వేరే మండలాల నుంచి యూరియాను లారీల్లో బడా రైతుల కోసం తరలిస్తున్నరని కానీ చిన్నకారు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పొలాలు లేని రైతుల పేరుతో దొంగబిల్లులు సృష్టించి యారియాను బడా రైతులకు అందజేస్తున్నట్లు ఆరోపించారు. చిన్నకారు రైతులకు న్యాయం జరగకపోతే వైకాపా ఆధ్వర్యంలో సొసైటీల వద్ద ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement