మా ఇంటికిరాని మహాలక్ష్మి | Sakshi
Sakshi News home page

మా ఇంటికిరాని మహాలక్ష్మి

Published Fri, Dec 15 2017 1:00 PM

Users Waiting For Maa inti Mahalakshmi Scheme In ap - Sakshi

బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘బాలికా సంరక్షణ పథకం’ ప్రారంభించారు. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఆ పథకం పేరు మార్చివేశారు. ప్రస్తుతం ‘మా ఇంటి మహా లక్ష్మి’ పేరుతో అమలవుతున్న ఈ పథకాన్ని అటక ఎక్కించే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సాక్షి, మచిలీపట్నం: బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో ప్రవేశపెట్టిన బంగారుతల్లి (మా ఇంటి మహాలక్ష్మి) పథకాన్ని బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వాలు మారాయి.. పథకం పేరు మారింది.. బాలిక భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పథకాన్ని అటక ఎక్కించే దిశగా అడుగులు పడ్డాయి. వెరసి మూడున్నరేళ్లుగా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకునే వెబ్‌సైట్‌ పనిచేయకపోవడమే  ఇందుకు నిదర్శనం.

పథకం ఉద్దేశం ఏమిటంటే..
బాలికా శిశు మరణాలు, బాల్యవివాహాలను అరికట్టి బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాలికా సంరక్షణ పథకం ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లల తరువాత ఆపరేషన్‌ చేయించుకుంటే రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్సార్‌ మరణాంతరం పలు  ఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. మహానేత పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అప్పటి ముఖ్యంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన బంగారుతల్లి బాలికా అభ్యుదయ సాధికారత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిం ది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేక్చూలని నిర్ణయించింది.

అర్హులు.. అందే సాయం
పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్, ఐకేపీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పాప పుట్టిన మరు క్షణమే తొలి విడతగా రూ.2,500, రెండేళ్ల రెమ్యూనరేషన్‌ వైద్య సేవల కోసం ఏడాదికి రూ.వెయ్యి మంజూరు చేస్తారు. పాపకు 3, 4, 5 ఏళ్ల వయసుకు రాగానే పౌష్టికాహారం కోసం ఏటా రూ.1500, విద్యాభ్యాసం నిమిత్తం ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు ఇస్తారు. విద్యాభ్యాసం నిమిత్తం 6,7, 8, తరగతుల్లో రూ. 2,500. 9,10 తరగతుల్లో రూ.3 వేలు, ఇంటర్‌లో ఏడాదికి రూ.3500, డిగ్రీ లో ఏడాదికి రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్‌తో చదువు ఆపేస్తే రూ.50 వేలు చొప్పున జమ చేయాలని నిర్ణయించారు.

దరఖాస్తులపై స్పష్టత ఏదీ?
తొలుత ఐకేపీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని అధికారులు స్పష్టీకరించారు. అనంతరం ఐసీడీఎస్‌ ద్వారా సాయం అందుతుందని, ఈ మేరకు విధివిధానాలను సైతం రూపకల్పన చేశామని పాలకులు, అధికారులు సెలవిచ్చారు. తీరా చూస్తే మూడున్నరేళ్లుగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. ఈ విషయమై ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని, ఐసీడీఎస్‌ అధికారులు సైతం అది తమ పథకం కాదని సామాధానమిస్తుండటంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరి వద్ద వెల్లబోసుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. 

మూడున్నరేళ్లుగా ముప్పుతిప్పలు
పథకం ప్రారంభ సమయంలో జిల్లాలో 22 వేల మంది బాలికలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పారితోషికంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం అమలు విషయమై పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారికే సాయం అందే సూచనలు కనిపించడం లేదు. మూడున్నరేళ్లుగా వేలాది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వారు వెబ్‌సైట్‌ ఎప్పుడు పనిచేస్తుందా? తమ పిల్లల పేర్లు నమోదు చేసుకుందామా? అని ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు          : 22,000
ఒక్కొక్కరికి మొదటి విడత మంజూరు చేసిన మొత్తం   :రూ.2500
జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన నిధులు                    : రూ.5.50 కోట్లు 

Advertisement
Advertisement