ఇది చలనం లేని ప్రభుత్వం : యూటీఎఫ్ | Sakshi
Sakshi News home page

ఇది చలనం లేని ప్రభుత్వం : యూటీఎఫ్

Published Fri, Aug 21 2015 4:49 PM

UTF Stages dharna

అనంతపురం అర్బన్ :  రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి చలనం లేదు. చర్మం మందం... చిన్నపాటి ధర్నాలు చేస్తుంటే  దులుపుకుపోతుంది. కదిలించాలంటే పెద్ద పోరాటాలే చేయాలని యూటీఎఫ్ ధర్నాలో ఎమ్మెల్సీ గేయానంద్ పిలుపునిచ్చారు. మెరిట్‌ని ఉపాధ్యాయులకు కాదు.. తన ప్రభుత్వంలోని మంత్రులకు, ప్రజలకు సేవ చేయకుండా దోచుకుంటున్న ఎమ్మెల్యేకు చంద్రబాబు ఇచ్చుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ విద్యని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుళు ధ్వజమెత్తారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జిలాన్ అధ్యక్షతన ధర్నాకు వారితో పాట రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ఉద్యోగుల, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నాన్పుడు ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి చర్మం మందం. సాధారణ ఆందోళనలు చేస్తే దులుపుకుపోతుంది. దిగిరావాలంటే పెద్ద ఎత్తున్న పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు కానీ చలనం రాదన్నారు. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్‌లో మెరిట్ మెలిక పెట్టారు. ఎవరికి మెరిట్ ఇస్తారు... ముందు మీ మంత్రులకు మెరిట్ ఇచ్చి తొలగించండి. గెలిపించిన ప్రజలకు సేవ చేయకుండా తినడానికే పనిచేస్తున్న మీ ఎమ్మెల్యేలకు ఏమి మెరిట్ ఉందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఉపాధ్యాయులను బదిలీ చేసుకుంటే తప్పేంటని అనడానికి మంత్రి పత్తిపాటి పుల్లారావుకి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 15 సమస్యలు ఏళ్లగా ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూనే ఉందన్నారు.

ఒకవైపు కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దిగిరావాలంటే అన్ని వర్గాలకు ప్రభుత్వ విద్య ప్రాధాన్యతను వివరించి, వారిని కలుపుకుని పెద్ద ఎత్తున్న పోరాటం చేయాలని అన్నారు. ఓబుళు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ విద్యని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జయరామప్ప మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ని రాజధాని పేరుతో అమరావతి చుట్టూ గుమ్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, సీనియర్ నేత రిటైర్డ్ ఉద్యోగి ఇమాం సాహెబ్, నాయకులు రామకృష్ణ, జనార్ధన్, సాయి, తిప్పయ్య, వేణుగోపాల్‌రెడ్డి, అదిశేషు, రాజన్న, నాగేంద్ర, జయచంద్ర, రమణయ్య, కె.నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement