మురిసిన ముక్కోటి | Sakshi
Sakshi News home page

మురిసిన ముక్కోటి

Published Sun, Jan 12 2014 4:10 AM

vaikunta ekadasi 2014 grand celebrations in nalgonda district

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే పెద్దఎత్తున భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఉత్తరద్వారం గుండా భగవంతుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయాలను నిర్వాహకులు అందంగా అలంకరించారు.
 
 ముక్కోటి ఏకాదశిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను విద్యుద్దీపాలు, రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. ప్రధానంగా నల్లగొండలోని రామాలయంతోపాటు యాదగిరిగుట్ట , మట్టపల్లిలలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
 ఉత్తరద్వార దర్శనం
 యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే స్వామిఅమ్మవారిని గులాబీ, మందారం, జాజిమల్లి, విరజాజి , మల్లె మొదలైన పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉదయం 6.50 గంటలకు స్వామి అమ్మవారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం  ఇచ్చారు. స్వామి అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని తిలకించడానికి చలినిసైతం లెక్కచేయకుండా భక్తులు ఉదయం 4 గంటల నుంచే కొండపై బారులు తీరారు. ఆలయ తిరు వీధులన్నీ అశేష భక్త జనంతో నిండిపోయాయి.

స్వామి అమ్మవారిని గర్భాలయం ఎదుట సుమారు అరగంట పాటు భక్తుల దర్శనార్థం ప్రత్యేక పీఠంపై అధిష్టింప జేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పంచోపనిషత్తులు, పంచసూక్తాల పఠనం చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ , దేవస్థానం చైర్మన్  బి. నర్సింహమూర్తి, ఈఓ కృష్ణవేణి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు గజ్వెల్ రమేశ్ బాబు, సురేందర్ రెడ్డి, రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గేట్లకు తాళాలు వేయడంతో స్వామి వారి సేవకు అంతరాయం కలిగింది.  స్వామి వారి ఊరేగింపు సేవలో భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో ఇబ్బందులు పడ్డారు.
 
 వైకుంఠ ద్వారం ద్వారా..
 మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శనివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాత:కాలార్చన, సుప్రభాతం, పంచామృతాభిషేకంతో శ్రీ స్వామి వారిని వైకుంఠ ద్వారదర్శనం గావించారు. ఈ సందర్భంగా సంస్కృత సోదరులు శ్రీనాథశర్మ, మహదేవశర్మల ఆధ్వర్యంలో లక్ష ఆరెపత్రి పూజను చేశారు. శ్రీగోదాదేవి అమ్మవారికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. ఆలయంలో వేదమంత్రపఠనం, నాదస్వర కచేరీ, పురాణకాలక్షేపం, సప్తస్వర నాట్యకళామండలివారిచే భక్తి గానలహరి, ద్రౌపదీ స్వయంవరం హరిక థ, శ్రీమట్టపల్లి క్షేత్రమహత్యం బుర్రకథ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.  
 
 స్థానిక ఎన్‌సీఎల్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్నదానం చేయడమేగాక మంచినీటిని సరఫరా చేశారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాయంత్రం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు నర్సింహారావు, ఈఓ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, నాగన్నగౌడ్, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, మంజీనాయక్,  అరుణాసైదులు,  శ్రీను, మట్టపల్లి రావు, విజయ్ కుమార్, వెంకటాచార్యులు, కృ ష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరి, ఫణి,నర్సింహమూర్తి, అధికసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
 
 ఘనంగా కుడారై ఉత్సవం
 నల్లగొండ కల్చరల్ : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయరుస్వామి ఆధ్వర్యంలో కుడారై ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 గంగాళాలలో పాయసాన్ని ఉంచి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అంతకుముందు తెల్లవారుజామున 5.30 గంటలకు స్వామివారిని ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని గావించారు. ఉదయం 10 గంటలకు నీరాటోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను  ఆలయ ప్రధానార్చకులు సముద్రాల యాదగిరాచార్య, కృష్ణమాచార్య, శఠగోపాలాచార్య చేపట్టారు.
 
 ఏఐసీసీ పరిశీలకులు రఫీఖ్‌అహ్మద్, ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, డీఎస్పీ రామ్మోహన్, డీసీసీ అధ్యక్షులు తూడి దేవేందర్‌రెడ్డి, టి.కుమార్‌రావు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, సభ్యులు జడల సువర్ణ, వంగరి సునీత, వేదాంతం శ్రీనివాసాచార్యులు, చకిలం వేణుగోపాల్‌రావు, వికాస తరంగిణి అధ్యక్షుడు రాజేశ్వరరావు, కార్యదర్శి సుజాత, రంగారావు, ఈశ్వరరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మెరుగుగోపి, వంగాల అనిల్‌రెడ్డి, అంబటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement