వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి | Sakshi
Sakshi News home page

వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి

Published Wed, Dec 3 2014 2:18 AM

Valmikulanu to identify candidates

కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. మంగళవారం ఆమె ఢిల్లీలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోలారాంను కలిసి వాల్మీకుల స్థితిగతులపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ పరిధిలో దాదాపు 4.50 లక్షల మంది వాల్మీకులు ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణిస్తున్నా.. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా గుర్తిస్తున్నారన్నారు.
 
 
 ఈ వ్యత్యాసం వల్ల అత్యంత వెనుకబడిన వాల్మీకులు  కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
 
  ఏపీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వాల్మీకుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వాల్మీకి భవన్ నిర్మించాలన్నారు. ప్రతి వాల్మీకి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ వాల్మీకిగానే చూపాలన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆమె కేంద్ర మంత్రికి వివరించారు. ఇదిలాఉంటే వాల్మీకుల్లోని ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఎంపీ బుట్టా రేణుక చేసిన కృషి పట్ల వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement