వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా | Sakshi
Sakshi News home page

వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా

Published Mon, Sep 4 2017 12:39 PM

వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా

విజయవాడ: దివంగత నేత వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన తనయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు బాధపడ్డారని తెలిపారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌతం రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రంగా అభిమానులు ఎవరూ బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.

రెండు హత్య కేసులతో గౌతంరెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ల్యాండ్‌ మాఫియాతోనూ ఆయనకు ప్రమేయముందని రాధా ఆరోపించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి నిన్న (ఆదివారం) ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మహిళ, మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా రత్నకూమారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, ఈ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది పోలీసుల అతివల్లే నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని రాధా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అన్ని వర్గాల కోసం వంగావీటి రంగా పనిచేశారని అన్నారు. చనిపోయిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన సూచించారు.
 

Advertisement
Advertisement