మగాళ్లకు భయం? | Sakshi
Sakshi News home page

మగాళ్లకు భయం?

Published Sun, Aug 24 2014 3:57 AM

మగాళ్లకు భయం?

- వేసెక్టమి ఆపరేషన్‌కు ముందుకు రాని పురుషులు
- జిల్లాలో ఐదేళ్లలో ఒక లక్షా 67 వేల 179 మంది మహిళలకు ట్యూబెక్టమీ
 - ఇదే కాలంలో కేవలం 563 మంది పురుషులకు వేసెక్టమీ
- మహిళలతో పోలిస్తే 0.33 శాతమే!
- చైతన్యం కల్పిండంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలం

సాక్షి, అనంతపురం :  జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేందుకు పురుషులు వెనుకాడుతున్నారు. 2009-10 నుంచి తీసుకుంటే వేసెక్టమీ శస్త్ర చికిత్సలు ఏడాది కేడాది తగ్గిపోతున్నాయి. 2010 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వైద్య సిబ్బంది టార్గెట్ 1.85 లక్షలు కాగా, ఇందులో 1,67,742 మంది స్త్రీ, పురుషులకు వేసెక్టమీ, ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో 563 మంది పురుషులు వేసెక్టమీ చేయించుకోగా, 1,67,179 మంది స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకోవడం గమనార్హం. కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తయిపోయే వేసెక్టమీ శస్త్ర చికిత్స అనంతరం.. 48 గంటల్లో ఎవరి పనులు వారు యధావిధిగా చేసుకోవచ్చు. అయిదు నుంచి పది నిమిషాల్లోనే పూర్తయ్యే వేసక్టమీలో కోత, కుట్టు లేకుండా శస్త్ర చికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత 30 నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు.

లైంగిక ప్రక్రియలో ఎటువంటి ఆటంకం ఉండదు. శారీరకంగా బలహీన పడటం ఉండదు. వేసెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత అవసరమైనపుడు కావాలనకుంటే రీకెనలైజేషన్ చేయించుకోవడం ద్వారా మళ్లీ సంతానం కోసం ప్రయత్నించవచ్చు. ఈ పద్దతిలో 90 శాతం వరకు సంతాన అవకాశాలు పుష్కలం. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి వెనుకాడుతున్న పురుషుల్లో అవగాహన, చైతన్యం కల్పించడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైందనే చెప్పాలి.
 
అపోహలు వీడాలి
జిల్లా ప్రజల్లో వేసెక్టమీపై పలు అనుమానాలు వెనకడుగు వేసేలా చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ  అపోహలేనని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పురుషులంతా ఈ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు. వేసెక్టమీ చేయించుకున్న వారి శరీరంలో శక్తి తగ్గిపోయి బరువు పనులు చేయలేరనే వదంతులు.. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే ఆందోళన.. స్త్రీలు ఇంట్లోనే ఉంటారు కదా..వారికే శస్త్ర చికిత్స చేయించాలన్న పెత్తనం.. ఇటీవల ప్రసవాలన్నీ దాదాపుగా సిజేరియన్ చేస్తుండడం, అందులోనే కు.ని శస్త్ర చికిత్స చేయించేయడం.. కుటుంబ ప్రధాన సంపాదకుడు శస్త్ర చికిత్స చేయించుకుంటే తరువాతి కాలంలో కష్టపడలేడన్న భయాన్ని వీడాలని వైద్యులు చెబుతున్నారు.
 
ప్రోత్సాహకం రూ.1100

 వేసెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ప్రభుత్వం రూ.1100 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. వేసెక్టమీని ప్రోత్సహించి ఆస్పత్రికి తీసుకువచ్చిన వారికి ప్రోత్సాహకరంగా రూ.250 చెల్లిస్తారు. వేసెక్టమి చేసిన వైద్యునికి రూ.150 చెల్లిస్తారు. అదే ట్యూబెక్టమీ చేయించుకునే మహిళకు రూ.850, ప్రోత్సహించి తీసుకువచ్చిన వారికి రూ.150 చెల్లిస్తారు.
 
పురుషులు ముందుకు రావాలి
 వేసెక్టమీ శస్త్ర చికిత్స సురక్షితమైనది. ఎటువంటి కుట్టు, కోత లేకుండా చేస్తాం. దీనిపై అపోహలు వీడి శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు పురుషులు ముందుకు రావాలి. శస్త్ర చికిత్స అనంతరం రెండు రోజుల్లో ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. సైకిల్ తొక్కడం, బండ్లు లాగడం, వాహనాలు నడపడం, బరువులు ఎత్తడం తదితర పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. పురుషులు సహకరించి వేసెక్టమీ శస్త్ర చికిత్సలకు ముందుకు రావాలి.          
- ఇన్‌చార్జ్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరాముడు, అనంతపురం.

Advertisement

తప్పక చదవండి

Advertisement