పెప్సీకి అడ్డదారిలో పన్ను రాయితీ ? | Sakshi
Sakshi News home page

పెప్సీకి అడ్డదారిలో పన్ను రాయితీ ?

Published Thu, Sep 12 2013 1:59 AM

పెప్సీకి అడ్డదారిలో పన్ను రాయితీ ?

అర్హత లేని పరిశ్రమలకూ రాయితీల పంట
 నెగటివ్ లిస్ట్‌లోని పెప్సీ కంపెనీకి వ్యాట్ రాయితీ కల్పించేందుకు యత్నాలు
 ఎస్‌ఐపీసీ ఎజెండా నుంచి చివరి నిమిషంలో వ్యాట్ రాయితీ ప్రతిపాదన
 వెనక్కి నేరుగా ఆర్థిక శాఖకు ఫైలు పంపేందుకు రంగం సిద్ధం చక్రం తిప్పుతున్న ప్రభుత్వ పెద్దలు

 
 సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు రాయితీల విషయంలో వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడుంటే ఏమిటన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పారిశ్రామిక విధానానికి భిన్నంగా పలు పరిశ్రమలకు అదనపు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా అర్హత లేని కంపెనీకి సైతం పన్ను రాయితీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో పెప్సీ కంపెనీ నెలకొల్పనున్న కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్‌కు రాయితీల విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. పారిశ్రామిక విధానం 2010-15 ప్రకారం.. కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్‌కు రాయితీలు ఇచ్చేందుకు వీలు లేదు. పారిశ్రామిక విధానంలో ఈ పరిశ్రమను నెగటివ్ లిస్టు జాబితాలో చేర్చారు. నెగటివ్ లిస్టులోని పరిశ్రమలకు రాయితీలు ఇచ్చిన సందర్భాలు గత పదేళ్లలో ఎన్నడూ లేవు.
 
 అయితే, పెప్సీ కంపెనీకి ఎలాగైనా రాయితీలు ఇచ్చేందుకు వీలుగా సంబంధిత రాయితీ ప్రతిపాదనలను ఆగస్టు 28న జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్‌ఐపీసీ) ముందుంచకుండానే.. నేరుగా ఆర్థిక శాఖకు ఫైలును పంపాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పరిశ్రమల శాఖ పావులు కదుపుతోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే అర్హత లేకున్నా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కానున్న ఇసుజూ కార్ల యూనిట్‌కు 135 శాతం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాయితీని ప్రభుత్వం కల్పించింది. మెదక్ జిల్లాలో నెలకొల్పనున్న మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌కు 50 శాతానికి బదులుగా ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఈ వ్యవహారాల్లో భారీగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
 
 ఎస్‌ఐపీసీని కాదని...!
 వాస్తవానికి ఏదైనా పరిశ్రమకు రాయితీ ఇవ్వాలంటే సంబంధిత ప్రతిపాదనను పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ముందుంచుతుంది. ఆర్థిక శాఖతో పాటు వాణిజ్య, ఇంధన, రెవెన్యూ, మునిసిపల్ శాఖలతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శులు కూడా ఈ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పారిశ్రామిక విధానం మేరకు ఏయే పరిశ్రమలకు ఎంత రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని విశదీకరిస్తూ, అందుకు అనుగుణంగా ఎస్‌ఐపీసీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ముందుకు ప్రతిపాదనలు వెళతాయి. ఎస్‌ఐపీబీలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా భాగస్వాములవుతారు. వాస్తవానికి ఎస్‌ఐపీసీతో పాటు ఎస్‌ఐపీబీ ఆమోదం లభించిన తర్వాతే సదరు పరిశ్రమకు రాయితీలను మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేస్తుంది.
 
 ఇందుకు భిన్నంగా రాయితీలు ఇవ్వడం అనేది పారిశ్రామిక విధానాన్ని అవహేళన చేయడమే అవుతుంది. అయితే, పెప్సీ కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తోంది. పైగా ఎస్‌ఐపీసీ సమావేశంలో ఎజెండాలో ఉన్న పెప్సీ కంపెనీ రాయితీల ప్రతిపాదనను... చివరి నిమిషంలో ఎజెండా నుంచి తొలగించారు. ఫైలును నేరుగా ఆర్థిక శాఖకు పంపాలని ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పెప్సీ యూనిట్‌కు రాయితీల విషయంపై ఆర్థిక శాఖకు పంపేందుకు పరిశ్రమల శాఖ ఫైలును సిద్ధం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement