మూడో రోజూ కొనసాగిన విజయమ్మ ఆమరణ దీక్ష | Sakshi
Sakshi News home page

మూడో రోజూ కొనసాగిన విజయమ్మ ఆమరణ దీక్ష

Published Thu, Aug 22 2013 2:56 AM

Vijayamma Samara Deeksha enters third day

సాక్షి, గుంటూరు : ప్రజలకు సమన్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమమే ఊపిరిగా సాగుతోంది. ‘సమన్యాయమే’ లక్ష్యంగా, ప్రజల ఆశీస్సులే ఆలంబనగా సమరస్ఫూర్తిని నింపుతోంది. సోమవారం ప్రారంభమైన విజయమ్మ సమరదీక్ష బుధవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసపడినప్పటికీ, తన కోసం తరలి వస్తున్న వృద్ధులు,  మహిళల్ని చూసి కూడదీసుకున్న సత్తువతో విజయమ్మ పలకరిస్తూ, ప్రతి నమస్కార చేస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు.
 
 పల్లెలు, పట్టణాల నుంచి వేలాదిగా వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, వివిధ వృత్తుల్లో కొనసాగేవారు విజయమ్మను కలిసేందుకు వస్తూనే ఉన్నారు. ప్రధానంగా బుధవారం మహిళా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదయం 10 గంటల సమయంలో విజయమ్మను  ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. ఆ తరువాత  పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిలు కొద్దిసేపు విజయమ్మతో మాట్లాడారు. దీక్షా శిబిరానికి వచ్చిన కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కూడా కొద్దిసేపు మాట్లాడారు. ‘కడప సంగతులేంటని’ విజయమ్మ ప్రశ్నించారు. ఆపైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకుల్ని విజయమ్మకు పరిచయం చేశారు.
 
 సంఘీభావం తెలిపిన న్యాయవాదులు...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఆవరణ నుంచి ర్యాలీగా శిబిరానికి తరలి వచ్చారు. ఒక్కొక్కరుగా విజయమ్మను కలసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి ప్రసంగించారు. అనంతరం న్యాయవాదులతో కలసి విజయమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే కృష్ణాడెల్టా ఎడారిగా మారే ప్రమాదముందనీ, వేల కోట్లతో నిర్మించిన పులిచింతలకు గుక్కెడు నీరు కరువయ్యే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఆ వినతి పత్రంలో వివరించారు. అనంతరం పెదకాకాని నుంచి వచ్చిన గుంటూరు కృష్ణా జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆర్కే తల్లిదండ్రులు ఆళ్ల  దశరథరామిరెడ్డి. వీరరాఘవమ్మలు విజయమ్మను కలసి ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన తల్లి పెదకాకాని సర్పంచ్‌గా విజయం సాధించినట్టు ఆర్కే వివరించారు.  కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది మహిళా సర్పంచ్‌లు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విజయమ్మను కలసి తమ మద్దతు ప్రకటించారు. విజ్ఞాన్ కళాశాల విద్యార్థినులు తమ సంఘీభావం తెలిపారు. అంతకుముందు చిన్నపాటి స్వరంతో కొద్దిసేపు విజయమ్మ ప్రసంగించారు.
 
 కొవ్వొత్తులతో సంఘీభావం..
 బుధవారం రాత్రి దీక్షా శిబిరంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. విజయమ్మతో పాటు పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. అనంతరం గుంటూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షౌకత్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది.  గుడివాడ ఎమ్మె ల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రసంగించారు. 
 
 శిబిరంలో పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ,అంబటి రాంబాబు, ఎమ్మెల్యే లు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, యువజన విభాగం జిల్లా కన్వీనర్  కావటి మనోహర్‌నాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, ఎస్టీ విభాగం కన్వీనర్ హనుమంత్‌నాయక్, పార్టీ సమన్వయకర్తలు కోన రఘుపతి, మందపాటి శేషగిరిరావు, నసీర్ అహ్మద్, షౌకత్, రావి వెంకటరమణ, గుదిబండి చినవెంకటరెడ్డి, విద్యార్థి విభాగం నేత నర్సిరెడ్డి, పురుషోత్తం, నాయకులు గులాం రసూల్,  నూనె ఉమామహేశ్వరరెడ్డి, దోసపాటి నాగేశ్వరరావు, ముస్తఫా, నెల్లూరు జెడ్పీమాజీ చైర్మన్ బాలచెన్నయ్య, విజయవాడ నగర నేత గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement