గూడెం గజగజ.. | Sakshi
Sakshi News home page

గూడెం గజగజ..

Published Sun, Dec 22 2013 4:27 AM

villagers are suffering for chilled weather

అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల అటవీప్రాంతంలో చలి, ఈదురుగాలులకు చెంచులు వణికిపోతున్నారు. మంచు తుంపరకు బొడ్డు గుడిసెలు, గుడారాలు తడిసి ముద్దవుతున్నాయి. పక్కాఇళ్లు లేకపోవడంతో గుడిసెల్లోనే చలి మంటలు కాచుకుంటూ బతుకుజీవుడా.. అంటూ కాలం గడుపుతున్నారు. ఎముకలు కొరికే చలిలో అడవిబిడ్డలు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా నల్లమలలోని కోర్ ఏరియాలో జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులు మరింత దుర్భరంగా మారాయి.
 
 అప్పాపూర్,పుల్లాయిపల్లి, రాంపూర్, బౌ రాపూర్, సంగడిగుండాలు, బక్కచింతపెంట, ఫర్హాబాద్, మేడిమొల్కల, తాటిగుండాలు, ఇర్లపెంట, ఆగర్లపెంట, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట తదితర ని వాసప్రాంతాల్లో చెంచులు చలికి వణికిపోతున్నాయి. ఇక్కడ ఏ పెంటల్లోనూ పక్కాఇళ్లు లేవు. వీరు ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. 40 ఏళ్లనాడు ఎలా ఉన్నామో ఇప్పు డు అలాగే ఉన్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి ఎన్ని రోజులు తాము చెట్లకింద జీవించాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు.
 
 కనిపించని దోమ తెరలు
 దోమల నుంచి రక్షణ పొందేందుకు చెంచులకు దోమతెరలు ఎంతో అవసరం. కానీ వాటిని అందిండంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమైంది. ఐదేళ్ల క్రితం పంపిణీ చేసిన దోమ తెరలు పనికి రాకుండా పోయాయి. గతంలో ఏటా ప్రభుత్వపరంగా చలికాలంలో చెంచులకు దోమతెరలు అందించేవారు. ఇప్పుడు వీటి ఊసేలేకపోవడంతో దోమలతో చెంచులు మలేరియా, డెంగీ వ్యాధుల బారినపడుతున్నారు. మలేరియా వైవాక్స్, మాలేరియా ఫాల్సీఫెరమ్ వ్యాధుల నివారణకు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలి జ్వరాలతో బాధపడే వారి నుంచి రక్తపూత సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇంతవరకు వైద్యులు అక్కడికి వెళ్లిన దాఖలాల్లేవు.
 
 దయనీయస్థితిలో చెంచులు
 రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఐటీడీఏ లెక్కల ప్రకారం 36వేల మంది చెంచు జనాభా ఉంటే జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 112 చెంచుగూడెల్లో 7500 జనాభా ఉంది. చెంచుల పక్కా ఇళ్లు కలగానే మిగిలాయి. ఉన్న ఇళ్లలో సరైన వసతులు లేకపోవడంతో చెంచులు ఇబ్బందుల మధ్య కాలం గడుపుతున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, లిం గాల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, హన్వాడ, మండలాల్లోని గిరిజన గూడెల్లో అసంపూర్తిగా కూలిపోతున్న ఇళ్ల మ ద్య గిరిపుత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు.
 
 చెంచుల క ష్టాలు చూడలేని రెడ్‌క్రాస్ సంస్థ వారు గుడారాలను అందజేసింది. కొన్నిగాలికి లేచిపోగా ఉన్నకొన్ని కూడా చిరిగిపోయాయి. వాటిలోకి క్రిమికీటకాలు, విషసర్పాలు చేరుతుండటంతో అందులో ఉండలేని పరిస్థితి నెలకొంది. అడవిలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ  చలితో చెట్లకింద ఎంతకాలం ఇబ్బందులు పడాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆదుకోవాలని గిరిపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement
Advertisement