పల్లె.. సంబరాల ముల్లె | Sakshi
Sakshi News home page

పల్లె.. సంబరాల ముల్లె

Published Mon, Jan 13 2014 11:36 PM

పల్లె.. సంబరాల ముల్లె - Sakshi

మెతుకుసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. భూమి పుత్రులు పంటల రాకతో, పిల్లలు గాలి పటాల ఆటలతో, మహిళలు నోములు వ్రతాలతో, పెద్దలు కుటుంబమంతా కలిసిన ఆనందంతో వేడుకను జరుపుకుంటున్నారు.  అమ్మాయిలు రంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు. నువ్వులు, పలుకులు, పుట్నాలు, పేలాలు, బెల్లం మెళవింపుతో తయారు చేసిన ముద్దలు ఘుమఘుమలాడుతున్నాయి. సకినాలు, అరిసెలు, కుడుములు మొదలగు పిండి వంటల రుచులు నోరూరిస్తున్నాయి.

 నవధాన్యాలు పేర్చి మధ్యలో పిడకలపై మట్టిగురిగిలో పాలు, బియ్యం పోసి పొంగించే వైవిధ్య సంబరం ప్రారంభమైంది. దోషాలు తొలగి సిరి సంపదలు జీవితాల్లో ఉప్పొంగాలనే ఎన్నో అశలతో ప్రజలు సంక్రాంతిని ఆహ్వానిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, విద్యారీత్యా విభిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారెందరో కని పెంచిన పల్లెలకు, పట్టణాలకు వచ్చేశారు. ఆకాశం గాలి పటాల జోరుతో కళకళలాడుతోంది.

 
 ఇంటికి చేరి సందడి చేస్తూ..
 ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రణతిసుధ, శ్రావణి పండుగ కోసం చేగుంటలోని తమ ఇంటికి చేరుకున్నారు. పండుగతోపాటు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. పుస్తకాలతో నిత్యం కుస్తీ పడే వీరు ఇంటి పని లో తల్లికి ఆసారాగా ఉంటున్నారు. చేగుంట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మురళికి ముగ్గురు కూతుళ్లు. పెద్దకూతురు ప్రణతిసుధ ఆదిలాబాద్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.

రెండో కూతురు శ్రావణి  హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. పండుగ సంబరాల కోసం వీరిద్దరు ఇంటికి చేరుకున్నారు. ప్రణతి అమ్మ వాణిశ్రీకి పిండివంటలు చేయడంలో సహకరిస్తుండగా శ్రావణి తన చిన్నారి చెల్లికి చిట్టి పొట్టి నీతికథలు చెబుతుంది. ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి చేరడంతో సందడిగా ఉందని తల్లిదండ్రులు వాణి,మురళి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.     
 
 ‘సకినాలు’ బహుత్ అచ్చాహై..
 సకినాలు టేస్టు బహుత్ అచ్చాహై.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలి జిల్లా అడోభర్ గ్రామానికి చెందిన విద్య. గోదావరి సుజల స్రవంతి పైపులైన్ నిర్మాణం పనులు నిర్వహిం చేందుకు ఏడాది కిందట నంగునూరు మండలం పాలమాకులకు వచ్చి స్థిరపడ్డారు అనూజ్, విద్య దంపతులు.

వీరు ఉంటున్న ప్రాంతంలో అందరూ ప్రత్యేక వంటకాలు చేస్తుండగా ఈమె కూడా వాటి తయారీని తెలుసుకుని తమ పిల్లలకు చేసి పెడుతున్నారు. అప్పాలు, చెగోడీలు, సకినాలు, బెల్లంనువ్వుల ముద్దలు చేస్తుంది. సంక్రాంతి పండుగను ఇక్కడ బాగా చేస్తారని తెలిపింది. తమ  పిల్లలు సింకు, కీర్తనలతో కలిసి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టినట్టు చెబుతుంది విద్య. ఇక్కడి సంప్రదాయం తమకు బాగా నచ్చిందని చెబుతుంది ఆమె.

Advertisement
Advertisement