ఉత్సవం అదిరేలా.. | Sakshi
Sakshi News home page

ఉత్సవం అదిరేలా..

Published Tue, Jan 20 2015 12:20 AM

ఉత్సవం అదిరేలా..

ఘనంగా విశాఖ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు
నగరానికి సరికొత్త సొబగులు
23, 24, 25 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు

 
విశాఖ ఉత్సవ్-2015ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీచ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. బీచ్ రోడ్డులో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్నారు. ట్రాఫిక్ ఐలాండ్‌లున్న చోట విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. హోటల్స్, షాపింగ్ మాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆయా యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.
 
విశాఖపట్నం సిటీ:  విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ విశాఖ అందాలకు ప్రచారం కల్పిస్తున్నారు. అందుకు ప్రత్యేక బృందాలను తరలించి ఆయా ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేలా రాయితీల ప్రకటిస్తున్నారు. ఆ మూడు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రధాన వేదికలపై కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది కళాకారులను సమీకరించి వారితో ప్రత్యేక ర్యాలీని చేపట్టి పర్యాటకుల్లో జోష్ పెంచాలనుకుంటున్నారు. బీచ్‌లో భారీ వేదికలను సిద్ధం చేస్తున్నారు. అధునాతన లైటింగ్, సినీ కళాకారులతో డ్యాన్స్‌లు, చిన్న చిన్న నాటికలతో యువతను అలరించే కార్యక్రమాలను  నిర్వహించనున్నారు. నగరంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించేలా పెయింటింగ్స్ వేస్తున్నారు.
     
21వ తేదీన 3 వేల మంది మహిళలతో ఏయూ గ్రౌండ్స్‌లో ముగ్గుల పోటీలు
22వ తేదీన నోవాటెల్ హోటల్ ఎదురుగా బీచ్ రోడ్డులో కైట్ ఫెస్టివల్
ఆరేడు క్రీడాంశాల్లో ప్రత్యేకమైన క్రీడా పోటీలు
పిల్లల కోసం అన్ని పాఠశాలల్లోనూ వ్యాసరచన, వ్యక్తత్వ, పెయింటింగ్, స్లోగన్స్ పోటీలు
25వ తేదీన బీచ్ తీరంలో 100కు పైగా విద్యుత్ దీపాలతో అలంకరించిన బోట్లతో ప్రదర్శనలు
నేవీ బ్యాండ్ ప్రదర్శన, 100 మీటర్ల ఎతై ్తన టవర్‌పై విద్యుత్ ప్రభలు, సినీ నటి శోభన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి.
 
పరిమళ: వుడా పార్కు కేంద్రంగా పరిమళ పేరుతో ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకూ ఈ ప్రదర్శన ఉంటుంది. ఆ మూడు రోజుల పాటు మ్యూజిక్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
 
కళ: సిరిపురం గురజాడ కళా క్షేత్రం వేదికగా ఆ మూడు రోజుల్లో రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
 
జాతర: కళా గ్రామం పేరిట మధురవాడ జాతర వద్ద ఆ మూడు రోజుల్లో రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజనుల థింసా నత్యం, గరగల నృత్యం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
 
ఉత్సవ్ వేదిక: విశాఖ ఉత్సవ్-2015 ప్రధాన వేదికను ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేదిక కేంద్రంగా రోజూ సాయంత్రం 5 నుంచి సాయంత్రం 10 గంటల వరకు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
 
ఉత్సవ్‌ను విజయవంతం చేయండి
 

విశాఖ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. సర్క్యూట్ హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల్లో విశాఖను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ విశాఖ ఉత్సవ్-2015 అని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రధానంగా మూడు వేదికల్లో నిరంతరం కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు రోజులు పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 150 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, అందులో రాయితీలతో కూడిన ఆహారం అందించేందుకు హోటల్ యజమానులు ముందుకొచ్చారని గుర్తు చేశారు. ఎవరి నుంచి బలవంతంగా ఉత్సవాల కోసం విరాళాలు కోరడం లేదని, ఇచ్చిన వారి నుంచి మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్సవాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఖర్చులు, వచ్చిన నిధుల వివరాలను వేదికలపై ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement