సంక్షోభంలో విశాఖ షిప్‌యార్డ్ | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో విశాఖ షిప్‌యార్డ్

Published Wed, Nov 12 2014 9:17 AM

సంక్షోభంలో విశాఖ షిప్‌యార్డ్ - Sakshi

  • సంక్షోభంలో విశాఖ షిప్‌యార్డ్
  • ఆర్డర్లు లేక అయోమయం
  • కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకం
  • ఆదుకోవాలని కేంద్రానికి కార్మిక సంఘాల వేడుకోలు
  • సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రమైన హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రానికి నాలుగేళ్లుగా ఆర్డర్లు లేవు. ప్రస్తుతం జరుగుతున్న పనులు రెండేళ్లలోపు పూర్తికానున్నాయి. అప్పటికి చేతిలో ఆర్డర్లు లేకపోతే కార్మికులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేని దుస్థితికి షిప్‌యార్డ్ చేరుకునే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో షిప్‌యార్డ్‌ను నిలబెట్టేందుకు కనీసం రూ.1132 కోట్లతో ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కల్పించాలని యార్డ్ చైర్మన్ ఎస్.కె.మిశ్రా ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.
     
    పూర్తి కావస్తున్న పాత ఆర్డర్లు

    వార్‌షిప్స్ తయారు చేసే యార్డ్‌లు దేశంలో నాలుగే ఉన్నాయి. వాటిలో మొదటిది విశాఖకాగా మిగిలిన మూడు కోల్‌కత్తా, ముంబై, గోవాల్లో పనిచేస్తున్నాయి. విశాఖ షిప్ యార్డ్‌లో ఏటా 2,3 పెద్ద వెసల్స్, 6,7 చిన్న వెసల్స్ తయారు చేసేవారు. కానీ ఆ స్థాయిలో ఆర్డర్లు రాలేదు.  2008-09 సంవత్సరంలో డిఫెన్స్ వెసల్ వార్ష్‌షిప్ నిర్మాణానికి రూ.1600 కోట్లు ఆర్డర్ వచ్చింది. ఆదే ఏడాది డిఫెన్స్ జనరల్ వెసల్ తయారీకి రూ.9500 కోట్ల ఆర్డర్ పొందింది. రూ.250 కోట్ల వ్యయం అయ్యే కోస్ట్ గార్డ్ షిప్‌లు ఆర్డర్ లభించింది. ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రెండేళ్లలో ఇవి పూర్తవుతాయి.
     
    అప్పట్లో ఆదుకున్న వైఎస్సార్

    2008-09 తర్వాత షిప్‌యార్డ్‌కు ఆర్డర్లు రావడం మానేశాయి. రెండేళ్లలో ఈ పనులు పూర్తయితే ఆ తర్వాత పరిస్థితి ప్రశ్నార్థకమే. ఈ యార్డ్‌పై ఆధారపడి దాదాపు 1700 మంది శాశ్వత, 700 మంది తాత్కాలిక సిబ్బంది బతుకుతున్నారు.
     
    ప్రస్తుతం వీరంతా భవిష్యత్‌పై ఆందోళనలో ఉన్నాయి. 2006-07లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి, విశాఖ ఎంపీ నేదురుమిల్లి జనార్ధనరెడ్డిలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రూ.826 కోట్ల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కల్పించేలా చేశారు. ఆ మొత్తంతో షిప్‌యార్డ్ యాజమాన్యం బ్యాంకులకు రుణాలు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించింది. ప్రస్తుతం కార్మికులకు యాజమాన్యం రూ.100 కోట్లు, బ్యాంకులకు రూ. 850 కోట్లు బకాయి పడింది.
     
    కొత్త ఆర్డర్ల కోసం కేంద్రానికి విన్నపం

    ఇలాంటి సమయంలో కేంద్రం రూ.80 కోట్లతో రక్షణ వ్యవస్థకు అవసరమైన పరికరాలు సమకూర్చుతామని చెప్పడంతో వాటి తయారీ ఆర్డర్‌లో అధిక భాగం హిందూస్థాన్ షిప్‌యార్డ్‌కు కేటాయించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలో కార్మిక నాయకులు ఇటీవల ఢిల్లీ వెళ్లి రక్షణ శాఖ మంత్రిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. దేశంలో మిగతా షిప్‌యార్డ్‌లలో ప్రస్తుతం తగినంత ఆర్డర్లు ఉండడం వల్ల భారత నౌకాదళానికి వెంటనే కొత్త నౌకల్ని నిర్మించి ఇవ్వలేవని, విశాఖ షిప్‌యార్డ్‌కు ఆర్డర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

    సముద్రంలో అకస్మాత్తుగా నౌకలు నిలిచిపోతే అక్కడికే వెళ్లి మరమ్మతులు చేసే ఎల్‌పీడీ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ బాధ్యతలను షిప్‌యార్డ్‌కు అప్పగిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హిందూస్థాన్ షిప్‌యార్డ్ బలోపేతంపైనా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని యాజమాన్యం, కార్మికులు ఎదురుచూస్తున్నారు.
     

Advertisement
Advertisement