ఉత్సాహంగా ఎమ్మెల్యేల ప్రమాణం | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎమ్మెల్యేల ప్రమాణం

Published Thu, Jun 13 2019 10:57 AM

Vishakapatnam Mla's Oath Cermony In Ap Assembly - Sakshi

సాక్షి,విశాఖపట్నం : నవ్యాంధ్ర రెండో శాసనసభ కొలువు తీరింది. బుధవారం నుంచి ప్రారంభమైన తొలి అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు స్పీకర్‌ ఫోడియం ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ సభ్యులు గెలుపొందగా.. మిగిలిన 11 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో ఆరుగురు తొలిసారి సభలో అడుగుపెట్టగా..ఒకరు మూడోసారి అడుగుపెట్టారు.

మిగిలిన నలుగురు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇరువురు నాలుగోసారి సభలో అడుగుపెట్టగా, మిగిలిన ఇరువురు మూడోసారి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత ఎన్‌.చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆపై అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.  తొలిసారి సభలో అడుగుపెట్టిన వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

సభలో అడుగు పెట్టగానే తొలుత ముఖ్యమంత్రిని, ఆ తర్వాత మంత్రులను,సహచర ఎమ్మెల్యేలను పలుకరిస్తూ అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించారు. వీరంతా తొలుత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే సమయంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సభలో తొలిసారి అడుగుపెట్టిన వారిలో నాగిరెడ్డి మినహా మిగిలిన వారంతా పిన్న వయస్కులే.

ఇప్పటి వరకు బయట నుంచి చూసిన శాసనసభలో నేడు తాము సభ్యులు కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరంతా తమ కుటుంబ సభ్యులతో సభకు చేరుకున్నారు. వారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా విజిటర్స్‌గ్యాలరీ నుంచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఒకింత ఉద్విగ్నానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ ముగియగానే కుటుంబ సభ్యులతో ఆనందపరవశులయ్యారు.   

Advertisement
Advertisement