జిల్లాలో నిండుకున్న విటమిన్‌ ఏ ద్రావణం | Sakshi
Sakshi News home page

జిల్లాలో నిండుకున్న విటమిన్‌ ఏ ద్రావణం

Published Wed, Jun 13 2018 2:07 PM

Vitamin A deficiency in Vizianagaram - Sakshi

బొబ్బిలి: రేచీకటి, అంధత్వాన్ని నివారించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్‌ ఏ సిరప్‌ నిల్వల కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో చిన్నారుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ద్రావణం జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండుకుని సుమారు రెండు నెలలు గడచింది. పుట్టిన బిడ్డలకు 9వ నెల నుంచి ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి తప్పనిసరిగా వేయాల్సిన విటమిన్‌ ఏ ద్రావణం గతంలో నిత్యం సరఫరా చేసేవారు.

అయితే ఇప్పుడా నిల్వలు కానరా వడం లేదు. గతంలో నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చేసరికి సరఫరా చేసేవారు. కానీ రెండు నెలలు అవుతున్నా గానీ అటు జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఈ ద్రావణం లేక చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర కలత చెందుతున్నారు. ఇతర వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ముఖ్యమైన ఈ వ్యాక్సిన్‌ లేకపోవడంతో తల్లి దండ్రులు తమ చిన్నారుల భవిష్యత్తుపై అల్లాడుతున్నారు.

కేవలం బొబ్బిలిలోని సీహెచ్‌సీలోనే ప్రతీ ఆరు నెలలకోసారి సుమారు 200కు పైగానే చిన్నారులకు ఈ ద్రావణం వేసేవారు. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు ఈ ద్రావణం వేస్తారు. ఇలా ప్రతీ సారి 9 నెలలు నిండిన ప్రతిబిడ్డకూ ఈ ద్రావణాన్ని వేయడం తప్పనిసరి, చిన్నారుల్లో ఈ ద్రావణం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఈ ద్రావణాన్ని ఇతర మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని కూడా రాయడం లేదు. బయట ఈ ద్రావణం దొరికే అవకాశం లేదు.

గతంలో ఈ ద్రావణాన్ని సరఫరా చేసే సంస్థ నాణ్యతలో లోపాలతో పంపిణీ చేయడంతో అధికారులు వీటిని తిప్పి పంపారు. అయితే తిరిగి మరి ఆస్పత్రులకు ద్రావణాన్ని వేయకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మందుల కొరత వలన చిన్నారుల దృష్టి లోపం, రోగనిరోధక శక్తి, రేచీకటి సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

సర్దుబాటు చేస్తున్నాం..

రెండు నెలలుగా విటమిన్‌ ఏ ద్రావణం సరఫరా లేకపోయినప్పటికీ తమ వద్ద ఉన్న నిల్వ లతో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. నెల రోజుల క్రితం వరకు విటమిన్‌ ఏ డోసులు అందించాం. ఈ విషయమై డీఐఓ కార్యాలయానికి నివేదించామని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు ఇండెంటు పెట్టినట్లు వారు చెప్పారు.            – డాక్టర్‌ విజయ్‌మోహన్, బొబ్బిలి పీపీ యూనిట్‌ అధికారి.

పిల్లలకు ఇతర విటమిన్‌ ద్రావణాలు వేస్తున్న దృశ్యం  

Advertisement
Advertisement