జిల్లాలో ఈ నలుగురి పదవులు పోయినట్లే | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఈ నలుగురి పదవులు పోయినట్లే

Published Tue, Jan 28 2020 8:41 AM

Vizianagaram MLCs Who Lost Their Posts With Dissolution Of Legislature - Sakshi

సాక్షి, విజయనగరం: శాసన మండలిని పెద్దల సభ అని పిలుచుకుంటుంటాం. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుంచి ప్రతినిధులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మేధావులు కొలువు తీరే సభ రాష్ట్ర ప్రభుత్వానికి పాలనలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. అయితే, ఆ లక్ష్యం నెరవేరనీయకుండా రాజకీయ అవసరాలకు సభను రాష్ట్ర ప్రతిపక్షపార్టీ వాడుకోవాలని చూడడంతో అసలకే మోసం వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాలనా వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలనా బిల్లుకు మద్దతు తెలపకుండా రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ వేసిన ఎత్తుగడ వారి పతనానికి దోహదపడింది. సలహాలు, సూచనలు ఇవ్వకుండా రాజకీయాలు చేసే సభ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని గుర్తించిన ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. లోక్‌సభ, రాజ్యసభతోపాటు రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే శాసనమండలి పూర్తిగా రద్దవుతుంది.
 
వీరి పదవులు పోయినట్లే..!  
శాసన మండలి రద్దుతో జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్సీలు పదవులు కోల్పోనున్నారు. జిల్లా నుంచి స్థానిక సంస్థలు కోటాలో పార్వతీపురానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్‌ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో సాలూరుకు చెందిన గుమ్మడి సంధ్యారాణి,  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా జిల్లాలోని భోగాపురానికి చెందిన పాకలపాటి రఘువర్మ కొనసాగుతుండగా, చినమేరంగికి చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా కోటాలో ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తున్నారు. వీరిలో రఘువర్మ తటస్థ సభ్యులుకాగా మిగతా ముగ్గురూ టీడీపీకి చెందిన నాయకులు. వీరి ముగ్గురి పదవీ కాలం మరో ఏడాదిన్నర వరకూ ఉంది. కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ పదవీకాలం ఏడాది మాత్రమే అయింది. ఇంకా ఆయనకు ఐదేళ్లు ఉంది. ఇకపోతే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా విశాఖకు చెందిన మాధవ్‌కు నాలుగేళ్లు పదవీకాలం ఉంది. శాసనమండలి రద్దుకు రాష్ట్ర పతి ఆమోదముద్ర వేసే వరకు కొనసాగుతారు.  (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక)


దెబ్బతీసిన ప్రతిపక్ష కుటిల రాజకీయాలు..  
శాసనమండలిని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2007లో పునరుద్ధరించారు. మేధావుల సూచనలు, సలహాలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అవసరమని ఆయన గుర్తించి ఈ పని చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా పని చేసిన 2014 నుంచి 2019 వరకు ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది. మేధావులు, నిపుణులను పక్కన పెట్టి తన రాజకీయ అవసరాలు తీర్చే వారిని పెద్దలు సభకు పంపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని తన కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కట్టడబెట్టారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు జగదీష్‌, సంధ్యారాణి రూల్‌ 71ను సమర్థిస్తూ ఓటు వేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు.  భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిపై వీరి ప్రభావం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకుంది. బాబు తీరుతో ఎమ్మెల్సీలు పదవులు కోల్పోయారు.  

చదవండి: శాసనమండలి రద్దు 

Advertisement
Advertisement