ఓటి బడ్జెట్ | Sakshi
Sakshi News home page

ఓటి బడ్జెట్

Published Tue, Feb 11 2014 3:43 AM

vote on account budget in Assembly

 

2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సమర్పించిన ఓటాన్ బడ్జెట్ ఆదాయ, వ్యయాల వివరాలు ఇవీ..

 పన్నుల ఆదాయం: రాష్ట్ర పన్నుల ఆదాయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, రవాణా, భూమి శిస్తు, స్టాంప్స్,రిజిస్ట్రేషన్ల ఆదాయాలు ఇమిడి ఉంటాయి. 2014-15లో పన్నుల ఆదాయం ద్వారా రూ.84,780.64  కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

 పన్నేతర ఆదాయం: పన్నేతర ఆదాయంలో రాష్ట్రానికి రావాల్సిన వడ్డీతో పాటు మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయాలు మొదలైనవి ఇమిడి ఉంటాయి. వచ్చే ఏడాదిలో రూ.16,262.26 కోట్లు పన్నేతర ఆదాయంగా వస్తుందని అంచనా వేశారు.

 మూలధన ఆదాయంలో బహిరంగ మార్కెట్ రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తదితరాలు ఉంటాయి. ఇందులో కేవలం ఒక్క బహిరంగ మార్కెట్ ద్వారా మాత్రమే ఏకంగా రూ.27,732.47 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
 

 

రూపాయి రాక
 1.    కేంద్ర పన్నుల్లో వాటా
 2. రాష్ట్ర పన్నుల ఆదాయం;
3. పన్నేతర ఆదాయం
 4. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్;
5. మూలధన ఆదాయం

రూపాయి పోక
 
 1.    వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, రవాణా
 2.    సంక్షేమం, పట్టణాభివృద్ధి, విద్య, కార్మిక, ఉపాధి
 3.    వేతనాలు, ఇతర వ్యయం
 
 రెవెన్యూ ఆదాయంలో నుంచి రెవెన్యూ వ్యయాన్ని తీసివేస్తే వచ్చే దాన్నే రెవెన్యూ మిగులు/లోటు అని అంటారు.

 మొత్తం రాబడికి మించి చేసే మొత్తం వ్యయాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు.
 


 జీతాలు.. తడిసి మోపెడు
 
 పెరిగిన పెన్షన్ల భారం..  రెండింటి భారం రూ.10 వేల కోట్ల..  పెరిగిన ప్రభుత్వ ఖర్చులు, వడ్డీ భారాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణ వ్యయం, విద్యుత్ సబ్సిడీ, వడ్డీలు పెరగడంతో ప్రణాళికేతర వ్యయం 13 శాతం పెరిగింది. గతేడాది రూ.1,01,926 కోట్లున్నది కాస్తా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.13,253 కోట్లు పెరిగి రూ. 1,15,179 కోట్లకు చేరింది. ప్రభుత్వోద్యోగుల జీతాల భారం తడిసి మోపెడైంది. ఇటీవల 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించిన నేపథ్యంలో జీతాలు, పెన్షన్లు పెరిగాయి. జీతాల పెంపు వల్ల ఏటా రూ.7,625 కోట్లు, పెన్షన్ల పెంపుతో రూ.2,308 కోట్ల భారం పడింది. జీతాలు, పెన్షన్లు కలిపి గతేడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగాయి. రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల విషయానికొస్తే గతేడాది రూ. 14,209 కోట్లున్న నాన్ శాలరీ వ్యయం ఇప్పుడు రూ.16,517 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ నిర్వహణ ఖర్చులో పెరుగుదలను చూపించలేదు. రుణాల చెల్లింపు భారం గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గింది. రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రూ.14,519 కోట్ల నుంచి 16,787 కోట్లకు పెరిగింది. బియ్యంపై సబ్సిడీని గతేడాది మాదిరే రూ.3,000 కోట్లకే పరిమితం చేశారు. విద్యుత్ సబ్సిడీని రూ.5,700 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచారు. విద్యుత్ సబ్సిడీపై గతేడాదితో పోలిస్తే ఖజానాపై రూ.1,800 కోట్ల అదనపు భారం పడింది.

 సంక్షేమానికి కోతే!

 2013-14 బడ్జెట్‌ను సవరించని ప్రభుత్వం
 ఒక్క వ్యాట్ ఆదాయంలోనే రూ.16 వేల కోట్ల కోత
 మిగిలిన ఆదాయూల పరిస్థితీ అంతే
 2012-13లో కూడా రూ.16 వేల కోట్ల కోత

 
 సాక్షి, హైదరాబాద్: 2012-13లో ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్: రూ.1,45,854 కోట్లు
 వాస్తవంగా చేసిన వ్యయం: రూ.1,29,440 కోట్లు అంటే ప్రతిపాదిత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.16,400 కోట్లకుపైగానే ఖర్చు చేయలేదు. అంటే ఈ మేరకు వివిధ పథకాలకు నిధుల్లో కోత వేసిందన్నమాట. ఇక 2013-14లో బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఈసారి కూడా వివిధ సంక్షేమ పథకాలకయ్యే ఖర్చుకు కోత వేయూల్సిన పరిస్థితే నెలకొంది. బడ్జెట్ అంటే ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు చేస్తామనే అంచనాలే. అయితే తదుపరి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో వేసిన అంచనాలకు, వాస్తవ పరిస్థితి మేరకు బడ్జెట్‌ను సవరిస్తారు. వీటినే సవరించిన అంచనాలు అంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (2014-15)ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విధంగా 2013-14 బడ్జెట్‌ను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా రూ.52,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.36 వేల కోట్లు మాత్రమే. కేవలం వ్యాట్ ఆదాయంలోనే రూ.16 వేల కోట్లకుపైగా కోత పడింది. మిగిలిన ఆదాయాల పరిస్థితీ అంతే. ఇందుకు అనుగుణంగా 13-14 బడ్జెట్‌ను సవరించాల్సి ఉంది. అరుుతే ప్రభుత్వం ఈ ప్రయత్నమేదీ చేయలేదు. అంటే ఏర్పడిన లోటు మేరకు వివిధ సంక్షేమ పథకాలకు చేయూల్సిన వ్యయంలో కోత కోస్తుందన్నమాట. ఎందుకంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోత కోసేందుకు సాధ్యం కాదు. బడ్జెట్ అంచనాలను సవరిస్తే ఈ నిజం బయటపడుతుందనే ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అంచనాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదని అంటున్నారు.

 రూ.9 వేల కోట్ల షాక్!

 వచ్చే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల భారం తప్పేలా లేదు. 2014-15లో మొత్తం రూ.16,500 కోట్ల మేర బడ్జెట్ లోటు ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పేర్కొన్నాయి. అంటే ఇందులో రూ.7,500 కోట్ల మేర సబ్సిడీ కింద ఇవ్వనున్నట్టు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. అంటే మిగిలిన రూ.9 వేల కోట్ల మేరకు ప్రజల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పిందన్నమాట. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారానే డిస్కంలు భర్తీ చేసుకుంటారుు. 2013-14 బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీకి రూ.5,700 కోట్లు సర్కారు కేటాయించింది. దీనితో పోలిస్తే సబ్సిడీ మొత్తం రూ.7,500 కోట్లకు పెరిగినప్పటికీ భారీ లోటు నేపథ్యంలో ప్రజలకు చార్జీల భారం తప్పేలా లేదు.

 ‘హోం’కు రూ. 450 కోట్లు

 రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 450 కోట్లు కేటాయించారు. రాష్ట్ర డీజీపీకి ఇందులో రూ. 247.2 కోట్లు మంజూరు చేశారు. ప్రణాళిక వ్యయంలో భాగంగా ఈ కేటాయింపులు చేశారు. ఆక్టోపస్‌కు గత ఏడాది మాదిరిగానే రూ. 35 కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కాంప్లెక్స్ నిర్మాణానికి క్రితంసారి మాదిరిగానే రూ. 18 కోట్లు ఇచ్చారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ఆధునీకరణ కు రూ. 25 కోట్లు, పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 20 కోట్లు, పోలీస్ విభాగం భవనాల నిర్మాణానికి రూ. 51 కోట్లు చొప్పున కేటాయించారు.

 రోడ్డురవాణాలో పాత అంకెలే..

 అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు.. కేటాయింపుల్లో స్వల్ప తేడాలు.. మొత్తంగా పాత అంకెలే పునరావృతం.. ఇదీ రోడ్డు రవాణా శాఖకు బడ్జెట్ కేటాయింపుల తీరు. ఏపీ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు (ఏపీఆర్‌డీసీ)కి గత బడ్జెట్‌లో కేటాయించినట్టుగానే రూ. 400 కోట్లు, రైలు మార్గాలున్న చోట్ల వంతెనల నిర్మాణానికి రూ. 210 కోట్లు, స్టేట్ హైవేలకు రూ. కోటి, ముఖ్యమైన జిల్లా రోడ్లకు రూ. 812 కోట్లు, చిన్న రోడ్లకు రూ. 83 కోట్లు, కడప రోడ్డు విస్తరణకు రూ. 2 కోట్లు, బీవోటీ కింద నిర్మించే గోదావరి ఫ్లైఓవర్ వంతెనకు రూ. 22 కోట్లు, ఏపీఆర్‌డీసీ కోర్ నెట్‌వర్క్ రోడ్లకు రూ. 796 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా (50%)గా రూ. 100 కోట్లు, ఇతర పీపీపీ రోడ్లకు రూ. 350 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీపీ పనులకు రూ. 135 కోట్లు కేటాయించింది.

 ఆర్టీసీకి రూ. 100 కోట్లు..

 కొత్త బస్సులు కొనేందుకు గతేడాది మాదిరే ఆర్టీసీకి రూ.100 కోట్లు కేటాయించారు.
 విమానాశ్రయాలకు రూ. 74 కోట్లు..
 సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి రాష్ట్ర వాటాగా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 74 కోట్లు కేటాయించింది. విజయవాడ, శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయం, విశాఖపట్నాలకు రూ. కోటి చొప్పున, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌కు రూ. 150 కోట్లు, తిరుపతి విమానాశ్రయానికి రూ. 300 కోట్లు, ప్రభుత్వ హెలికాప్టర్లు నిలిపే హాంగర్ నిర్మాణానికి రూ. కోటి చొప్పున బడ్జెట్‌లో కేటాయించారు.

 తగ్గిన ‘వైద్య, ఆరోగ్యం’ వాటా

 వైద్య ఆరోగ్య రంగానికి అరకొర కేటాయింపులే దక్కాయి. గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014- 15)  నిధులు స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తున్నా మొత్తం బడ్జెట్‌లో ఈ రంగం వాటా 4.02% నుంచి 3.74 శాతానికి తగ్గడం గమనార్హం.  

 పేదింటిపై చిన్నచూపు!

 రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే కావాల్సిన నిధులు రూ.15 వేల కోట్లు! కానీ బడ్జెట్‌లో ప్రభుత్వం అందుకు కేటాయించిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ.2,726 కోట్లు!! ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన ప్రణాళిక  కేటాయింపు (రూ.1,923) కంటే రూ.803 కోట్లు మాత్రమే ఎక్కువ. ఈసారి రూ.5 వేల కోట్లయినా ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ కోరినా పట్టించుకోలేదు.

 ఆహారానికి భద్రత ఏది?

 ఓట్ ఆన్ అకౌంటులో జాతీయ ఆహార భద్రత పథకం ప్రస్తావనే లేదు. ఈ పథకాన్ని జూలై 5లోగా కచ్చితంగా అమల్లోకి తేవాలి. పథకం అమలుకు ఏటా అవసరమైన సుమారు రూ.2,800 కోట్లను ఎలా సమకూర్చుతారనే అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.
 
 

Advertisement
Advertisement